క్రిప్టో కరెన్సీ.. మా దృష్టిలో గాంబ్లింగ్
లాటరీ, జూదంలో గెలిచినవారి దగ్గరి నుంచి పన్నులు ఎలా వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో లావాదేవీలపై పన్నుల వసూలు చేస్తామని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం కాదని, మనదేశంలో ఇపుడు దీనిపై సందిగ్ధావస్థ ఉందన్నారు. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, స్పెక్యులేషన్‌పై సంపాదిస్తే ఎలా పన్ను వేస్తామో… అలాగే క్రిప్టో లావాదేవీలపై పన్ను విధిస్తామని అన్నారు. క్రిప్టోలకు చట్టబద్ధత కలిగిస్తే ఎలా అన్నది తరవాత ఆలోచిస్తామని సోమనాథన్ స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ఈ లావాదేవీలపై 30 శాతం పన్ను, ఒక శాతం టీడీఎస్ విధించిన విషయం తెలిసిందే. బిట్ కాయిన్, ఎథిరియం లేదా ఎన్‌ఎఫ్‌టీలకు చట్ట బద్ధంగా చెలామణికి ఎప్పటికీ అనుమతించమని అన్నారు. క్రిప్టోకరెన్సీ నియంత్రణకు ప్రత్యేక చట్టం తెస్తామని శీతాకాల పార్లమెంటు సమావేశాల సమయంలో కేంద్రం హడావుడి చేసింది. కాని తరవాత హడావుడిగా ఈ చట్టం తెస్తే అభాసుపాలు అవుతామని ఆ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టారు.