నిన్నటి డార్లింగ్స్… నేటి విలన్స్!

జొమాటొ.. ఈ షేర్ మొన్నటి వరకు ఇన్వెస్టర్లకు కల్పతరువు. కేవలం ఏడాది క్రితం రూ. 107- ఈ షేర్ గత ఏడాది అంతా రాకెట్‌లా దూసుకుపోయింది. ఏడాది మధ్యలో రూ. 305 తాకింది. ఆకాశమే హద్దుగా సాగిన ఈ షేర్ స్పీడ్‌కు చాలా గట్టి బ్రేక్ పడింది. డిసెంబర్‌లో 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకిన ఈ షేర్ నిన్న క్రమంగా పడుతూ వచ్చింది. ఏడాది ఆరంభం నుంచే బలహీనంగా ఉన్న ఈ షేర్ తాజా ఆర్థిక ఫలితాలు గట్టి షాక్ తగలింది. నిన్న 6 శాతం దాకా పడిన ఈ షేర్ ఇవాళ 11 శాతం క్షీణించింది. ఇపుడు రూ. 215 వద్ద ముగిసింది. తక్షణం ఈ షేర్ రూ. 200 దిగువకు వెళుతుందని అనలిస్టులు అంటున్నారు. మరికొందరైతే రూ. 150ని తాకడం ఖాయమని అంటున్నారు. ప్చ్… దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని ఈ షేర్ చెప్పకనే చెబుతోంది.
ఇక పేటీఎం…
పేటీఎంది కూడా ఇదే స్థాయి పయనం. మరి పతనం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే పడటం ఇపుడే కదా మొదలైంది.52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 310 నుంచి పెరిగిన ఈ షేర్ రూ. 1063ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. ఈ షేర్ కూడా డిసెంబర్ గరిష్ఠ స్థాయి నుంచి పడుతూ వచ్చింది. ఇటీవలే రూ. 789ని తాకిన ఈ షేర్ మళ్ళీ కాస్త పడింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇవాళ 5 శాతం క్షీణించి రూ. 854ని తాకింది. మరి ఇక్కడి నుంచి పయనం ఎలా ఉంటుందో చూడాలి.
డిక్సన్ టెక్…
నెల క్రితం కూడా ఈ షేర్ ఇన్వెస్టర్ల డార్లింగ్. రోజూ పరుగులు తీసిన ఈ షేర్‌కు డిసెంబర్ నెలలో బ్రేక్ పడింది. డిసెంబర్ 17వ తేదీన ఈ షేర్ రూ.19,150ని తాకింది. అక్కడి నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చిన ఈ షేర్ ఇవాళ ఏకంగా 14 శాతం క్షీణించింది. ఫలితాలు సాధారణంగా ఉండటంతో ఈ కౌంటర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఈ షేర్ ఇపుడు రూ.15144 వద్ద ట్రేడవుతోంది. అంటే కేవలం నెలలో ఈ షేర్ 25 శాతంపైగా క్షీణించడం విశేషం. మరి ఈ షేర్‌లో ఒత్తిడి ఆగుతుందా లేదా మరింత క్షీణిస్తుందా అన్నది చూడాలి. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఇపుడు కూడా భారీ లాభాల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ షేర్ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 5783. అంటే గత ఏడాది జనవరి 24న కనిష్ఠ స్థాయి తాకింది. అక్కడి నుంచి కేవలం 11 నెలల్లో రూ. 5783 నుంచి రూ. 20,000 దాకా పెరిగింది. మరి మున్ముందు ఈ షేర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.