వందల కోట్లలో బెట్టింగ్ బిజినెస్
రేపు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పేరుకు అయిదే కాని… అందరి దృష్టి యూపీ, పంజాబ్‌లపైనే. సత్తా బజార్ అంటే బెట్టింగ్ ప్రపంచంలో బిజినెస్ అత్యధికంగా యూపీ ఎన్నికలపైనే జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం కేవలం ఒక్క లక్నో ప్రాంతంలోనే ఈ వ్యాపారం రూ.300 కోట్లకుపైనే ఉందని తెలుస్తోంది. నిన్నటి వరకు బెట్టింగ్ బిజినెస్ కాస్త వన్‌సైడ్‌గా ఉన్నా… ఇపుడు కాస్త టెన్షన్ నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్‌లో అన్నీ సర్వేలు బీజేపీ గెలుపును ఖాయం చేశాయి. సత్తా వ్యాపారంలో కూడా బీజేపీకు అనుకూలంగా బెట్టింగ్ ఉంటున్నా… చాలా మంది కనీస మెజారిటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో 2015-230 సీట్ల మధ్య రూపాయికి 25పైసలు కూడా ప్రీమియం ఇవ్వడం లేదు. అక్కడి నుంచి సీట్లు పెరిగే కొద్దీ ఇచ్చే పైసలు తగ్గుతున్నాయి. అలాగే సమాజ్‌వాదీ పార్టీకి కూడా 140-150 సీట్ల మధ్య బెట్టింగ్ అధికంగా ఉంది. ఈ సీట్ల స్థాయిలో రూపాయికి 25 పైసలే ప్రీమియం వస్తోంది. అక్కడి నుంచి సీట్ల పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతోంది. అంటే 180 సీట్లు కాసే వారికి రూపాయికి రూ. 1.70 ఆఫర్ చేస్తున్నారు అంటే 70 పైసలు ప్రీమియం వస్తుందన్నమాట. మరోవిధంగా చెప్పాలంటే సమాజ్ వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చే కొద్దీ… రిస్క్ పెరుగుతుందన్నమాట. అధిక రిస్క్ చేస్తున్న వారికి అధిక ప్రీమియం లభించడం సాధారణమే. ఇపుడు అధిక శాతం బెట్టింగ్ బీజేపీకి 215-225 సీట్లు వస్తాయని, సమాజ్‌వాదీ పార్టీకి 145-155 సీట్లు వస్తాయిని బెట్టింగ్ రాయుళ్ళ అంచనా. ఇక్కడి నుంచి ఏమాత్రం తేడా వచ్చినా… బెట్టింగ్ బిజినెస్ ఒక్కసారి హాట్‌గా మారిపోతుంది. ఇవాళ సాయంత్రం… రేపు ఉదయం నుంచి బెట్టింగ్ బిజినెస్ ఊపందుకుంటుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరవాత బెట్టింగ్ బిజినెస్‌లో పాల్గొనేవారు చివరి నిమిషం వరకు దూరంగా ఉంటున్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలం కాసినవారు భారీగా నష్టపోయారు. ఎగ్జిట్‌పోల్స్ అనుగుణంగా బెట్ కట్టడం ఆపేశారు. పైగా ఇపుడు బెట్టింగ్ బిజినెస్ ఆధునిక పద్ధతిలో.. కంప్యూటర్ల ద్వారా జరుగుతోంది. దీంతో రేపు ఉదయం కౌంటిగ్ ప్రారంభమైన తరవాత సత్తా బిజినెస్ ఊపందుకునే అవకాశముంది.