For Money

Business News

వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులు

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వడ్డీ రేట్లను పెంచింది. ఇటీవల ముగిసిన ఎంపీసీ సమావేశంలో ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఫిక్సెడ్‌ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. వడ్డీ రేట్లను అర శాతం పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ఇవాళ ప్రకటించింది. అలాగే అధిక రేట్లను చెల్లించేందుకు ఉద్దేశించిన ‘అమృత్‌ కలశ్‌’ (SBI Amrit Kalash) పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం గడువు డిసెంబర్‌ 31తో ముగియాల్సి ఉండగా.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచింది. ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తోంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (టీడీఎస్‌) కోత ఉంటుంది. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. ఇప్పటికే కొటక్‌ మహీంద్రా బ్యాంకు, డీసీబీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 0.25 శాతం మేర వడ్డీ రేట్లను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇవాళ పెంచింది. ఏడాది నుంచి 398 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.75 శాతానికి పెంచింది. 399 రోజుల కాలవ్యవధి ఎఫ్‌డీ రేట్లను 7శాతం నుంచి 7.25 శాతానికి పెంచింది. 400 రోజుల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాలవ్యవధి ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.30 శాతం నుంచి 6.50 శాతానికి శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లు సాధారణ డిపాజిటర్ల కంటే అర శాతం అదనపు వడ్డీ రేటు పొందుతారు. సూపర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ సాధారణ డిపాజిటర్ల కంటే 0.75 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అంటే డిసెంబర్‌ 27 నుంచి అమల్లోకి వచ్చినట్లు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.