యాక్సిస్ 3.5 శాతం జంప్… కారణం?
నిన్న ఇవాళ నిఫ్టి బ్యాంక్ భారీగా పెరిగింది. ఇటీవల తీవ్ర ఒత్తిడికి లోనైన ప్రైవేట్ బ్యాంకులు నిన్నటి నుంచి భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న రూ. 1401 ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇవాళ రూ. 1464 వద్ద ట్రేడవుతోంది. రేపటికల్లా ఈ షేర్ రూ. 1500 దాటుతుందని అనలిస్టుల అంచనా. కాని నిన్న, ఇవాళ భారీగా పెరిగిన షేర్ యాక్సిస్ బ్యాంక్. ఇవాళ ఇప్పటికే 3.5 శాతం పెరిగి రూ.765ను తాకిన ఈ షేర్.. ఇవాళ మరింత పెరిగే అవకాశముంది. భారత్‌లో సిటీ బ్యాంక్‌కు చెందిన కన్జూమర్ బిజినెస్‌ను యాక్సిస్ బ్యాంక్‌కు దక్కనున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు ఈ డీల్ వివరాలు వెల్లడించనున్నారు. సిటీ బ్యాంక్ బిజినెస్ కోసం చాలా బ్యాంకులు ప్రయత్నించాయి. అయితే యాక్సిస్ బ్యాంక్ అధిక మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ 200 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. సిటీ బ్యాంకుకు ఉన్న 26 లక్షల మంది కస్టమర్ల క్రెడిట్ కార్డ్ బిజినెస్ యాక్సిస్ చేతికి వస్తుంది. అలాగే యాక్సిస్‌బ్యాంక్‌కు అప్పగించిన తరవాత కూడా కస్టమర్లకు సిటీ బ్యాంక్ ద్వారానే సేవలు అందుతాయి. మరిన్ని వివరాలు ఇవాళ మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశముంది.