ఆ ఐపీఓ వేస్ట్?
హ్యుండాయ్ ఇండియా ఐపీఓ ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానుంది. దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించనున్న ఈ ఐపీఓపై మార్కెట్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఓ ధరల శ్రేణి రూ. 1865 నుంచి రూ. 1960. గరిష్ఠ ధర చొప్పున అలాట్‌మెంట్ జరిగితే ఇష్యూ సైజ్ రూ. 27,870 కోట్లు అవుతుంది. అయితే ఈ ఆఫర్‌పై ప్రముఖ ఇన్వెస్టర్ హీలియస్ కంపెనీ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం ఆటో రంగం గడ్డు స్థితిలో ఉందని అన్నారు. ఉన్న పది కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు పరిస్థితి బాగాలేదని అంటే… పరిశ్రమ ఎలా బాగున్నట్లని ఆయన ప్రశ్నించారు. ఎకనామిక్ టైమ్స్‌కు చెందిన ఈటీ నౌ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ… హ్యుందాయ్ ఇండియా ఐపీఓ వల్ల ఇన్వెస్టర్లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు. ధరల శ్రేణి గురించి ప్రస్తావిస్తూ… లిస్టింగ్ రోజు కాస్త అటూ ఇటుగా లిస్టింగ్ ఆఫర్ ధర వద్దే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏం జరుగుతుందో చూడాలని ఆయన చెప్పారు. ద్విచక్ర వాహనాల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, ఫోర్ వీలర్స్ పరిస్థితి బాగా లేదని అన్నారు. రానున్న అయిదేళ్ళలో ఫోక్స్‌వాగన్ ఈవీ బడ్జెట్ సుమారు 20,000 కోట్ల డాలర్లని ఆయన అన్నారు. ఈ స్థాయి బడ్జెట్‌తో బహుళజాతి కంపెనీలు పోటీ పడుతుంటే… మన కంపెనీలో ఏవిధంగా అంతర్జాతీయ మార్కెట్‌లో రాణిస్తాయని ఆయన అన్నారు. ఏం చేసినా దేశీయ మార్కెట్‌లోనేనని అన్నారు. ఇక్కడ పరిస్థితి బాగా లేదని… అందుకే ఈ రంగంలో తాను ఇన్వెస్ట్ చేయదల్చుకోలేదని సమీర్ అరోరా అన్నారు.