For Money

Business News

పెగసస్‌పై యాపిల్‌ కేసు

ఒకవైపు పార్లమెంటు సమావేశవాలు ప్రారంభమౌతున్న సమయంలో ప్రధాని మోడీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈసారి అనూహ్యంగా యాపిల్‌ నుంచి షాక్‌ వచ్చింది. పెగసస్‌పై ఇప్పటి వరకు నోరు మెదకపోయినా… ఇజ్రాయిల్‌కు చెందిన పెగసస్‌ను వాడినట్లు పలు కంపెనీలు ధృవీకరిస్తున్నాయి. ఇటీవల పెగసస్‌ అభివృద్ధి చేసిన ఎన్ఎస్‌ఓపై వాట్సప్‌ కేసు పెట్టింది. తమ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌ చేసి పెగసస్‌ను వాడారని ఆరోపించింది. తాజాగా యాపిల్‌ కూడా పెగసస్‌ మాతృసంస్థ ఎన్‌ఎస్‌ఓపై కేసు పెట్టింది. ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, ఫోటోలు, ఈ మెయిల్స్‌ను దొంగతనంగా పొందడంతో పాటు ఫోన్‌లో ఉన్న కెమెరా, మైక్రోఫోన్స్‌ను యాక్టివేట్‌ చేసి వినియోగదారుని కాల్స్‌ను రహస్యంగా రికార్డు చేసేందుకు పెగసస్‌ తమ ఫోన్స్‌ను హ్యాక్‌ చేసినట్లు యాపిల్‌ ఆరోపిస్తోంది.
పెగసస్‌ ద్వారా ఈ పనులు చేస్తున్నమాట నిజమేనని, అయితే వీటిని కేవలం తీవ్రవాదులు, నేరస్థుల కోసమే వాడుతున్నామని ఎన్‌ఎస్‌ఓ అంటోంది. అలాగే తాము కేవలం మిలిటరీ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నిఘా సంస్థలకే ఈ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతున్నట్లు తెలిపింది. ప్రభుత్వాలు దేశరక్షణ కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ ప్రత్యర్థులు, ఉద్యమకారులు, జర్నలిస్టులపై ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా యాపిల్‌ కంపెనీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నిఘా కోసం తమ కస్టమర్లను టార్గెట్‌ చేశారని, దీనికి ఎన్‌ఎస్‌ఓ బాధ్యత వహించాలని యాపిల్‌ కోర్టులో కేసు వేసింది. ఎన్‌ఎస్‌ఓతో పాటు ఆ కంపెనీ మాతృసంస్థ ఓఎస్‌వై టెక్నాలజీస్‌ కూడా ప్రతివాదిగా చేర్చింది. ఈ విషయాన్ని తన బ్లాగ్‌లో పోస్ట్‌ చేసింది.