For Money

Business News

పేటీఎంకు యాంట్‌ గుడ్‌బై

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం నుంచి చైనాకు చెందిన ఆలిబాబా వైదొలగనుంది. యాంట్‌ ఫిన్‌ ద్వారా పేటీఎం మాతృసంస్థ వన్‌ 97కమ్యూనికేషన్ష్‌లో తనకు ఉన్న వాటాను చైనా కంపెనీ విక్రయించనుంది. తాజా సమాచారం మేరకు పేటీఎంలో ఉన్న 5.4 శాతం వాటాను రేపు బ్లాక్‌డీల్‌ ద్వారా యాంట్‌ఫిన్‌ పూర్తిగా విక్రయించే అవకాశముంది. ఒక్కో షేరు ఫ్లోర్‌ప్రైస్‌ను రూ.1020గా నిర్ణయించినట్లు సమాచారం. కంపెనీ ఇవాళ్టి క్లోజింగ్‌ రూ.1078.20తో పోలిస్తే 5.4 శాతం డిస్కౌంట్‌కే షేర్ల విక్రయం జరగనుంది. డీల్‌ విలువ సుమారు రూ.3,845 కోట్లుగా ఉంటుందని అంచనా. మరి యాంట్‌ఫిన్‌ నుంచి వాటాను ఎవరు కొంటున్నారనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. అలీబాబాకు చెందిన యాంట్‌ ఫిన్‌కు 10.3 శాతం వాటా ఉండగా, ఈ ఏడాది మే నెలలో 4 శాతం వాటాను విక్రయించింది. ఇపుడు మిగిలిన వాటాను కూడా అమ్మేయనుంది. చైనా కంపెనీ పూర్తిగా పేటీఎం నుంచి వైదొలగడంతో… ఇక నుంచి ప్రభుత్వ పరంగా లేదా ఆర్బీఐ నిబంధనల నుంచి కంపెనీకి వెసులుబాటు ఉండే అవకాశముంది. అనేక అంశాల్లో చైనా కంపెనీకి వాటా ఉందనే నెపంతో కంపెనీకి పలు అనుమతులు రాలేదు.