తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్!
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. కాగ్ తాజా గణాంకాలు చూస్తుంటే… మున్ముందు ప్రభుత్వానికి గడ్డుకాలం తప్పలా లేదు. ఆదాయానికి మించి అప్పులు తెస్తుండటంతో భవిష్యత్తులో ఎలా నిధులు సర్దుబాటు చేస్తారన్న టెన్షన్ ఆర్థికశాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ఆదాయానికి మించి భారీగా అప్పులు తేవడంతో రెవన్యూ లోటు రెండు నెలలకే దారి తప్పింది. 2022-23 ఏడాదికి బడ్జెట్ ప్రవేశ పెట్టినపుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… పూర్తి ఏడాదికి రూ. 17,036 కోట్ల రెవెన్యూలోటు ఉంటుందని అంచనా వేశారు. తీరా చూస్తే కేవలం రెండు నెలల్లో అంటే ఏప్రిల్, మే నెలలకే రెవెన్యూ లోటు రూ.21,924 కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాలకు మించి 128 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలతో పోలిస్తే రెవెన్యూలోటు ఏకంగా 402 శాతం పెరిగినట్లు కాగ్ వెల్లడించింది. రెండు నెలలుకుగా రాష్ట్ర ప్రభుత్వం వసూళ్ళు రూ.17,975 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర ఆదాయం (కేంద్ర పన్నుల్లో వాటాతో సహా)రూ. 15,170 కోట్లు మాత్రమే. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా మరో రూ.2,167 కోట్లు వచ్చాయి. రెండు నెల్లో సొంత ఆదాయం 15,170 కోట్లయితే.. ఇదే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు రూ.22,960 కోట్లు.
ఏడాది అప్పులు.. 2 నెలల్లో…
గత ఏడాది ఫిబ్రవరి నెలాఖరున రూ.51,112 కోట్ల అప్పు చూపిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో రూ. 25,918 కోట్లు తగ్గించి మొత్తం ఏడాదికి రూ.25,012 కోట్ల అప్పులేనని గొప్పలు చెప్పుకుంది. తగ్గించిన రూ.25,918 కోట్లు ఎక్కడ అంటూ టీడీపీ వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. చిత్రంగా ఇపుడు ఆ లెక్కే ఇపుడు రాష్ట్ర అధికారులకు తలనొప్పిగా మారింది. 2021-22 పూర్తి ఏడాదికి అప్పులు రూ. 25,012 కోట్లయితే.. మరి రెండు నెలల్లోనే రూ. 22,960 కోట్లకు ఎలా చేరాయనే ప్రశ్నకు సమాధానం ఏది? మరి కాగ్ చూపిన ఈ లెక్కకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఏప్రిల్, మే నెలలో జీతాలు, వేతనాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 8,268 కోట్లు ఖర్చు పెట్టగా… కేవలం తెచ్చిన రుణాలపై వడ్డీకి రూ. 3,773 కోట్లు ఖర్చు పెట్టింది. మూలధన పెట్టుబడి వ్యయం కూడా దారుణంగా పడిపోయింది. ఏప్రిల్ నెలలో రూ. 360 కోట్లు, మే నెలలో రూ. 525 కోట్లు మూలధన వ్యయంగా చూపారు. అంటే రెండు నెలలకు కలిపి ఈ పద్దు కింద రూ. 886 కోట్లు ఖర్చు పెట్టారు. మరోవైపు రెవెన్యూ వసూళ్ళు దారుణంగా ఉన్నాయి. సగటున రెండు నెలలకు రెవెన్యూ వసూళ్ళు 18 శాతం నుంచి 20 శాతం ఉండాల్సింది. కాని బడ్జెట్ మొత్తంలో 10 నుంచి 12 శాతం మధ్య ఉంటున్నాయి. ఒక్క జీఎస్టీ, ఎక్సైజ్ ఆదాయం ఒక్కటే 14 శాతం మేర వసూలు అయ్యాయి.
ఇతర పద్దులు కూడా…
పూర్తి ఏడాదికి ప్రైమరీ లోటు కింద బడ్జెట్లో పేర్కొన్న మొత్తం రూ. 27,383 కోట్లు కాగా, అందులో 70 శాతం అంటే రూ. 19,187 కోట్లకు రెండు నెలల్లోనే చేరింది. ఇక ద్రవ్యలోటు కూడా పూర్తి ఏడాది టార్గెట్‌లో 47 శాతానికి చేరింది. పూర్తి ఏడాది ద్రవ్యోలోటు రూ. 48,724 కోట్లు అంచనా వేయగా, ఇప్పటికే రూ.22,960 కోట్లకు చేరింది. మొత్తం ఏడాది రూ. 48,761 కోట్లు అప్పు తెచ్చుకుంటానని చెప్పిన జగన్ ప్రభుత్వం కేవలం రెండు నెలల్లో 47 శాతం అంటే రూ. 22,965 కోట్ల అప్పు తెచ్చేసింది. రెవెన్యూ వసూళ్ళు… బడ్జెట్ టార్గెట్‌లో10 శాతం వరకు వసూలు కాగా, అప్పుల టార్గెట్‌లో 47 శాతం దాటాయి. మరి ఈ ఆర్థిక సంక్షోభాన్ని జగన్ ప్రభుత్వం మున్ముందు ఎలా నెట్టుకువస్తుందో చూడాలి మరి.