For Money

Business News

అమ్మకాల్లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌

ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల మధ్య కూడా రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఈ ఏడాది ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ అమ్మకాలను సాధించింది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జరిగిన ఇంటి అమ్మకాల సంఖ్య ఎన్నడూలేని స్థాయిలో నమోదు అయ్యాయి. 2021లో 2,36,500 యూనిట్ల ఇంటి అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది 54 శాతంగా వృద్ధితో 3,64,900 యూనిట్లు అమ్ముడైనట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అన్‌రాక్‌ తెలిపింది. ఇప్పటి వరకు 2014 పేరిట ఉన్న రికార్డును ఈ ఏడాది అధిగమించినట్లు అన్‌రాక్‌ తెలిపింది. 2014లో 3.43 లక్షల ఇంటి అమ్మకాలు జరిగాయి. ఢిల్లీ- ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటిన్‌ రీజియన్‌, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె నగరాలను అమ్మకాల వివరాలను అన్‌రాక్‌ వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా ముంబై మెట్రో రీజియన్‌లో 1,09,700 యూనిట్లు అమ్ముడైనట్లు అన్‌రాక్‌ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ (63,712), పుణె (57,146), బెంగళూరు (49,478) ఉన్నాయి. హైదరాబాద్‌లో గతేడాది 25,406 యూనిట్లు అమ్మగా, ఈ ఏడాది ఏకంగా 87 శాతం వృద్ధితో 47,487 యూనిట్లు అమ్మారు. అదే చెన్నైలో 29 శాతం వృద్ధితో 16,097 యూనిట్లు, కోల్‌కతాలో 21,220 యూనిట్ల హౌసింగ్‌ సేల్స్‌ జరిగినట్లు అన్‌రాక్‌ పేర్కొంది.