చివరల్లోనూ అమ్మకాల ఒత్తిడి
మిడ్‌సెషన్‌లో భారీగా ఒత్తిడికి లోనైన నిఫ్టి తరవాత కోలుకున్నట్లు అన్పించినా.. చివర్లో అమ్మకాల ఒత్తిడి తప్పలేదు. దీంతో నిఫ్టి 98 పాయింట్ల నష్టంతో 17718 వద్ద ముగిసింది. ఇవాళ రాత్రికి ఫెడ్ నిర్ణయం వెలువడ నుంచి. ఈ నేపథ్యంలో నష్టాల్లో ఉన్న యూరో మార్కెట్లు గ్రీన్‌లోకి రాగా, నష్టాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్‌లోకి వచ్చాయి. అయినా మన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టిలో 36 షేర్లు ఇవాళ నష్టాల్లో ముగియడం విశేషం. ఇతర ప్రధాన సూచీలు అర శాతం నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ ట్రాన్స్ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి నెక్ట్స్ 1.6 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టిలో కూడా శ్రీసిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు కూడా మూడు శాతంపైగా నష్టంతో ముగిశాయి. చాలా రోజుల తరవాత లారస్ ల్యాబ్ రెండు శాతంపైగా నష్టపోయింది. చాలా వరకు ఎఫ్ఎంసీజీ షేర్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఫెడ్ నిర్ణయం ముందు మన ఇన్వెస్టర్లు స్వల్పంగా లాభాలు స్వీకరించినట్లు కన్పిస్తోంది. రేపు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఉన్నందున… నిఫ్టిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండొచ్చు.