For Money

Business News

అదానీ విల్మర్‌ ఐపీఓ రేపే

ఇటీవల భారీ హంగామాతో వచ్చిన న్యూఏజ్‌ పబ్లిక్‌ ఇష్యూలలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల చేతులు బాగానే కాలాయి. ముఖ్యంగా ఇష్యూ సమయంలో షేర్లు లభించకపోవడంతో, లిస్టయిన తరవాత షేర్లు కొన్నవారు భారీగా నష్టపోయారు. దీంతో ఇన్వెస్టర్లు కొత్త ఐపీఓ అనగానే ఇపుడు కాస్త ఆలోచిస్తున్నారు. ఇటువంటి సమయంంలో రేపు అదానీ విల్మర్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభం కానుంది.ఫార్చ్యూన్‌ బ్రాండ్‌తో వంటనూనెలు, ఇతర ఆహార పదార్థాలు అమ్ముతున్న ఈ కంపెనీ ఇష్యూ శ్రేణి రూ. 218-రూ. 230గా నిర్ణయించింది. 31న ఇష్యూ ముగుస్తుంది. మార్కెట్‌ లాట్‌లో 65 షేర్లు ఉంటాయి. కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే రూ. 14,950లు కట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్లకు అంటే 845 షేర్లకు దరఖాస్తు చేయొచ్చు. అందుకు అయ్యే మొత్తం రూ. 1,94,350 మార్కెట్‌ నుంచి రూ. 3600 కోట్ల సమీకరణకు ఇష్యూ వస్తున్నా…రీటైల్ ఇన్వెస్టర్లకు కేవలం 35 శాతం షేర్లు మాత్రమే ఆఫర్‌ చేస్తున్నారు.ఫిబ్రవరి 8న లిస్టయ్యే అవకాశముంది.
అందరిదీ ఒకటే సలహా
సింగపూర్‌కు చెందినవిల్మర్‌, అదానీలు ఏర్పాటు చేసిన కంపెనీ ఇది. రెండు కంపెనీలకు చెరో సగం వాటా ఉంది. కంపెనీ పెట్టిన 12 ఏళ్ళ తరవాత ఇష్యూకు వస్తోంది. పది రాష్ట్రాల్లో 22 ప్లాంట్లు ఉన్నాయి కంపెనీకి. అలాగే పది క్రషింగ్‌ యూనిట్లు, 19 రిఫైనరీలు ఉన్నాయి. ఇందులో పది రిఫైనరీలు రేవుల వద్దే ఉండటం విశేషం. కంపెనీ టర్నోవర్‌లో 73 శాతం వంట నూనెల నుంచే వస్తోంది. ఇతర విభాగాల్లో కూడా కంపెనీ ఇంకా మంచి ప్రగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. పెద్ద గ్రూప్‌ అండతోపాటు ఇష్యూ తరవాత కూడా కంపెనీలో ప్రమోటర్లకు 87.92 శాతం వాటా ఉంటుంది. గత ఏడాది మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ రూ. 37,195 కోట్ల టర్నోవర్‌పై రూ. 727 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దాదాపు అన్ని స్టాక్‌ రీసెర్చి సంస్థలు ఈ ఇష్యూను దరఖాస్తు చేసుకొమ్మనే సలహా ఇస్తున్నాయి. అయితే ఈ షేర్‌పై ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న అనధికార ప్రీమియం తగ్గుతూ రూ. 45లకు పడింది. మరి ఇష్యూ సమయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈనెల 31న గ్రే మార్కెట్‌ ప్రీమియం చూసి దరఖాస్తు చేయండి. ఇప్పటి వరకు అదానీ గ్రూప్‌ షేర్లన్నీ ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాలను ఇచ్చాయి. కంపెనీపై విశ్వాసం ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు. భారీ లాభం రాకున్నా.. ఇతర షేర్ల మాదిరి నష్టాలు వచ్చే అవకాశం తక్కువని విశ్లేషకులు అంటున్నారు.