For Money

Business News

హెల్త్‌కేర్‌ రంగంలోకి అదానీ

హెల్త్‌కేర్‌ రంగంలోకి అదానీ గ్రూప్‌ ప్రవేశిస్తోంది. మెడికల్‌, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుతోపాటు పలు మార్గాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు ‘అదానీ హెల్త్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ (ఏహెచ్‌వీఎల్‌) పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. త్వరలోనే ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపింది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ కొనుగోలు ద్వారా సిమెంట్‌ రంగంలోకి అడుగుపెడుతున్న అదానీ.. తద్వారా దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా అవతరించనుంది. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత అనేక రంగాలకు విస్తరించిన అదానీ గ్రూప్‌ 30కి పైగా కంపెనీలు, వ్యాపారాలను కొనుగోలు చేసింది. తాజా హెల్త్‌కేర్‌ రంగంలోనూ భారీ కొనుగోళ్లకు తెరలేపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. దేశీయ కార్పొరేట్‌ హాస్పిటళ్లు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఫార్మసీ, డయాగ్నోస్టిక్‌, హెల్త్‌ టెక్‌ కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన పలు ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్టర్లు ప్రస్తుతం వైదొలిగే ప్రయత్నాల్లో ఉన్నారని.. వారి వాటాలు చేజిక్కించుకునేందుకు అదానీ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హెల్త్‌కేర్‌ రంగంలో 400 కోట్ల డాలర్ల (దాదాపు రూ.30,000 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టేందుకు అదానీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.