For Money

Business News

ప్రణయ్‌ రాయ్‌ జాక్‌ పాట్‌… డీల్ రూ.810 కోట్లు?

ఎన్‌డీటీవీ అమ్మకం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆ కంపెనీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌ జాక్‌ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఓపెన్‌ ఆఫర్‌ తరవాత కూడా ప్రణయ్‌ రాయ్‌ దంతులకు కంపెనీలో 27.26 శాతం వాటా ఉంది.కంపెనీలో అదానీలక మెజారిటీ వాటా దక్కినా… కీలక తీర్మానాలు చేయాలంటే 75 శాతం ఓటింగ్‌ అవసరం. అంటే ప్రణయ్‌ రాయ్‌ దంపతుల అనుమతి కచ్చితంగా కావాలి. దీంతో ప్రణయ్‌ రాయ్‌ వాటా కోసం అదానీలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెబి నిబంధనల ప్రకారం వ్యూహాత్మకంగా ఓపెన్‌ ఆఫర్‌ తరవాత తమ వాటా విక్రయించేందుకు ప్రణయ్‌ రెడీ అయ్యారు. ఓపెన్‌ ఆఫర్‌ సమయంలో కంపెనీ షేర్‌ బాగా పెరగడం ప్రణయ్‌కు కలిసి వచ్చింది. దీంతో ఇపుడు తన వాటాను అమ్మడానికి 60 రోజుల సగటు తీయగా షేర్‌ ధర రూ. 368.43గా తేలింది. చాలా మంది ఇన్వెస్టర్లు ఓపెన్‌ ఆఫర్‌లో తమ షేర్లను రూ. 294కు అమ్ముకున్నారు. మార్కెట్‌ ధర అధికంగా ఉన్నా ఓపెన్‌ ఆఫర్‌లో అమ్మినవారు ఇపుడు భారీగా నష్టపోయినట్లు తేలింది. సెబి నిబంధనల ప్రకారం 60 రోజుల సగటు రూ. 368.43 ఇచ్చేందుకు అదానీలు రెడీ అయ్యారు. అయితే తమ వాటాను అమ్మడం ద్వారా పూర్తి నియంత్రణ అదానీ చేతికి రానుంది… దీంతో తమకు ‘కంట్రోల్‌ ప్రీమియం’ కూడా కావాలని ప్రణయ్‌ రాయ్‌ పట్టుబట్టారు. మరో 25 శాతం ఇచ్చేందుకు అదానీలు అంగీకరించినట్లు సమాచారం. అంటే ప్రణయ్‌ రాయ్‌ నుంచి ఒక్కో షేర్‌ను రూ. 460.54లకు కొనేందుకు అదానీలు సిద్ధమయ్యారన్నమాట. ప్రణయ్‌ దంపతులకు కంపెనీలో 1.75 కోట్ల షేర్లు ఉన్నాయి. ఈ లెక్కన రూ.810 కోట్ల వస్తాయని లెక్క తేలింది. దీంతో చిన్న ఓపెన్‌ ఆఫర్‌లో రూ. 294కు అమ్ముకున్నవారు భారీగా నష్టపోయారన్నమాట. తమకు న్యాయం చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నా… ప్రణయ్‌-అదానీ డీల్‌ పూర్తిగా చట్టబద్ధంగా ఉన్నట్లు కార్పొరేట్‌ నిపుణులు అంటున్నారు. అయితే మరో టీవీ ఛానల్‌ పెట్టమని ప్రణయ్‌ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఎపుడో 2009లో రియలన్స్ నుంచి తీసుకున్న రూ. 403 కోట్లకు వడ్డీ కట్టే పనిలేకుండా ఎన్‌డీటీవీ నుంచి ప్రణయ్‌ రాయ్‌ బయటపడ్డారు. పైగా సీబీఐ, ఈడీతో పాటు ఐటీ కేసులు ఉండవు. ఇన్నాళ్ళు ఛానల్‌ను నడిపినందుకు ఎంచక్కా రూ. 810 కోట్లతో బయటపడుతున్నారన్నమాట.