For Money

Business News

అదానీ ఇన్వెస్టర్లు లబోదిబో

మొన్నటి దాకా అదానీ షేరు ఉంటే చాలు.. కాసుల పంటే. స్టాక్‌ మార్కెట్‌లో రాత్రికి రాత్రి లక్షలు సంపాదించి పెట్టిన షేర్లలో అదానీ షేర్లు అగ్రభాగాన ఉన్నాయి. చాలా మంది లక్షాధికారులయ్యారు. కాని ఒకే ఒక్క రీసెర్చి నివేదిక… రెండే రోజులు. అదానీ ఇన్వెస్టర్లలో భయం. కలవరం. ఇన్వెస్టర్లు ఎంతగా ఆందోళన చెందారంటే… మార్కెట్‌ డార్లింగ్‌ అయిన అంబుజా సిమెంట్‌ కూడా 31 శాతం పడింది. పోటీ పడి అదానీ కొన్న ఎన్‌డీటీవీ షేర్లను కొనే నాథుడు లేడు. కేవలం రెండు రోజుల్లో అదానీ గ్రూప్‌ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 4. 22 లక్షల కోట్లు తగ్గింది.
హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ వాటాదారులు బెంబేలెత్తిపోయారు. ఇప్పటికే అదానీ గ్రూప్‌పై పలు అనుమానాలు ఉండటంతో… సాధారణ ఇన్వెస్టర్లు తాజా వార్తలకు షాక్‌ అయ్యారు. అయినకాడికి అదానీ షేర్లను వొదిలించుకునే ప్రయత్నం చేశారు. పలు షేర్లలో లోయర్‌ సీలింగ్‌ పడింది. అంటే షేర్లు అమ్మకానికి ఉన్నా… కొనేవారు లేరు. కేవలం రెండు సెషన్స్‌లో అదానీ గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ క్యాప్‌ నాలుగు లక్షల 22 వేల కోట్ల రూపాయలు తగ్గింది. తమ దగ్గరున్న షేర్ల విలువ క్షణక్షణానికి తగ్గడంతో… ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. అనేక మంది తమ షేర్లను తెగనమ్మడం ప్రారంభించారు. వారాంతం కావడంతో అమ్మకాల జోరు పెరిగింది. ఎన్నో ఏళ్ళు పటిష్టంగా ఉన్న అంబుజా సిమెంట్‌, ఏసీసీ షేర్ల పతనం ఇవాళ పెద్ద ఇన్వెస్టర్లను కూడా కలవరపర్చింది.
ప్రధాన షేర్లు కూడా…
అదానీ గ్రూప్‌ షేర్లలో అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్‌ కుప్పకూలింది. కేవలం రెండు సెషన్స్‌లో ఈ షేర్ మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్ల రూపాయలు తగ్గింది. అదానీ ట్రాన్స్‌ వాటాదారుల వద్ద షేర్ల విలువ ఏకంగా 83 వేల కోట్ల రూపాయిలు తగ్గింది. అదానీ గ్రూప్‌ బ్లూచిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌లో కూడా అమ్మకాలు ఆగలేదు. ఈ కౌంటర్‌లో రెండు రోజుల అమ్మకాల వల్ల 63 వేల కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాప్‌ తగ్గింది. అదానీ వాటాదారుల షేర్లను విలువను అమాంతంగా పెంచిన అదానీ గ్రీన్‌ కూడా ఇవాళ గిలగిల్లాడింది. ఈ షేర్‌ విలువ 68వేల కోట్ల విలువ తగ్గడం విశేషం. ఏపీ వంటి రాష్ట్రాలకు విస్తరించిన అదానీ పోర్ట్స్‌ విలువ కేవలం రెండు సెషన్స్‌లో 41 వేల కోట్లు తగ్గడంతో ఇన్వెస్టర్లు లబోదిబో అంటున్నారు. ఇటీవలే పోటీపడిన కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్‌ ఏకంగా 31 శాతం క్షీణించింది. వాటాదారుల వద్ద ఉన్న షేర్ల విలువ 31 వేల కోట్లు తగ్గింది. ఇదే సమయంలో కొన్న ఏసీసీ షేర్‌ ధర 26 శాతం పడిపోయింది. అలాగే ఇటీవల కొన్న ఎన్‌డీటీవీ న్యూస్‌ ఛానల్‌ షేర్‌ పది శాతం తగ్గింది. ఈ ధర వద్ద కొనేవారు లేరు. ఈ కంపెనీతో పాటు అదానీ గ్రీన్‌ పది శాతం, అదానీ టోటోల్‌ 25 శాతం, అదానీ వవర్‌, అదానీ విల్మర్‌ 10 శాతం, అదానీ పోర్ట్స్ 25 శాతం చొప్పున తగ్గాయి. ఈ కౌంటర్లలో లక్షల షేర్లు అమ్మకానికి ఉన్నా… కొనే నాథుడు లేడు. సోమవారంలోగా ఇంకా ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌తో ఇన్వెస్టర్లు అయినకాటికి అమ్ముకుని బయటపడేందుకు ప్రయత్నించారు. అదానీ గ్రూప్‌కు భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకు షేర్లు కూడా బాగా నష్టపోయాయి.
రంగంలోకి సెబి
అదానీ గ్రూప్‌ షేర్లలో సాగిన రక్తపాతంపై స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి రంగంలోకి దిగింది. హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ కంపెనీలపై సెబి విచారణ జరుపుతోంది. అందులో భాగంగా హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదికను కూడా పరిశోధించాలని నిర్ణయించింది.
రెండు రోజుల పతనం
అదానీ టోటల్‌ – రూ. 1,06,000 కోట్లు
అదానీ ట్రాన్స్‌ మిషన్‌ -రూ. 83,000 కోట్లు
అదానీ గ్రీన్‌ – రూ. 68,000 కోట్లు
అదానీ ఎంటర్‌ప్రైజస్‌ – 63,000 కోట్లు
అదానీ పోర్ట్స్‌ – రూ. 41,000 కోట్లు
అదానీ విల్మర్‌ – రూ. 7000
అదానీ పవర్‌ – 10,300 కోట్లు
అంబుజా సిమెంట్‌ – రూ. 31,000 కోట్లు
ఏసీసీ – రూ. 11,200 కోట్లు
ఎన్‌డీటీవీ – రూ. 1,000 కోట్లు