రూ. 8 లక్షల కోట్లు ఔట్
హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక వెలువడిన తరవాత అదానీ గ్రూప్ షేర్ల మార్కెట్ విలువ రూ. 8,20,000 కోట్లకు పైగా క్షీణించిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ ప్రైజస్ ఇవాళ మరో 30 శాతం పైగా క్షీణించి రూ.1,107ని తాకింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను నిషేధించడంతో ఈ షేర్ మళ్ళీ కోలుకుని రూ. 1531 వద్ద ముగిసింది. ఈ షేర్ ఇంత భారీగా నష్టపోయినా డెలివరీ శాతం కేవలం 10 శాతం మాత్రమే ఉండటం విశేషం. అంటే ఈ షేర్లను మధ్య/దీర్ఘకాలం కోసం కొనడానికి ఎవరూ ఇష్టపడటం లేదన్నమాట. మరోవైపు అదానీ గ్రూప్ షేర్ల పతనంలో అదానీ ఎంటర్‌ప్రైజస్ అగ్రస్థానంలో ఉంది. ఈ షేర్ మార్కెట్ క్యాప్ రూ. 2.5 లక్షల కోట్లు క్షీణించింది. అదానీ పోర్ట్స్ మాత్రం ఇవాళ 5 శాతంపైగా లాభంతో ముగిసింది. అలాగే అంబుజా సిమెంట్, ఏసీసీ షేర్లు నాలుగు నుంచి అయిదు శాతం లాభపడ్డాయి. అయితే అదానీ గ్రూప్‌లోని అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ షేర్లు ఇవాళ కూడా పది శాతం లోయర్ సీలింగ్‌తో ముగిశాయి. అలాగే అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్ షేర్లు 5 శాతం నష్టంతో లోయర్ సీలింగ్ వద్ద ముగిశాయి. ఈ నాలుగు కౌంటర్లలో కొనుగోలుదారులు లేరు.