బొగ్గు దిగుమతి కాంట్రాక్ట్ అదానీకే?
ప్రభుత్వ రంగ సంస్థల బొగ్గు దిగుమతి కాంట్రాక్ట్‌లు అన్నీ అదానీ గ్రూప్‌కే దక్కేలా ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీపీసీకి బొగ్గు దిగుమతి చేసి ఇచ్చే కాంట్రాక్ట్ అదానీ ఎంటర్‌ప్రైజస్ దక్కించుకుంది. ఆరు రాష్ట్ర ప్రభుత్వ రంగ కంపెనీలు, 19 ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు బొగ్గు దిగుమతి చేసుకుని సరఫరా చేసే బాధ్యత కోల్ ఇండియా తీసుకుంది. దీనికి సంబంధించి టెండర్లను పిలిచింది. వచ్చిన టెండర్లను గత శుక్రవారం తెరవగా.. అదానీ ఎంటర్‌ప్రైజస్ ఆఫర్ చేసిన ధర అన్నింటికంటే తక్కువగా తేలింది. 24.16 కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి చేసి సరఫరా చేసేందుకు చెట్టినాథ్ లాజిస్టిక్స్ అనే కంపెనీ రూ. 4222 కోట్లు ఆఫర్ చేయగా, మోహిత్ మినరల్స్ అనే కంపెనీ రూ. 4182 కోట్లు కోట్ చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ రూ. 4,033 కోట్లకే ఆఫర్ చేస్తానని పేర్కొంది. అంటే రూ. 149 కోట్లు తక్కువ ఆఫర్ చేయడం ద్వారా ఈ కాంట్రాక్ట్ అదానీ ఎంటర్ప్రైజస్కే దక్కనుందన్నమాట.