For Money

Business News

నల్గొండలో అదానీ సిమెంట్‌ ఓకే?

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇపుడు అదానీ సిమెంట్‌ ప్లాంట్ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. దేశ వ్యాప్తంగా అదానీని మోడీ తొత్తుగా అభివర్ణించే కాంగ్రెస్‌ పార్టీ… తెలంగాణలో అదే అదానీకి వెన్నుదన్నుగా నిలిస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అదానీ కార్పొరేట్‌ సామ్రాజ్యం అవినీతి మయమని కాంగ్రెస్‌ నేత ఒకవైపు రాహుల్‌ గాంధీ విమర్శిస్తుంటే.. అదే సమయంలో అదే గ్రూప్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల విరాళాన్ని అందుకుంది. ఇది జనం కోసమని, రాష్ట్ర సీఎం ఫండ్‌కు ఇచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నా… బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం తమ విమర్శలను మరింత ఎక్కు పెడుతున్నారు. అదానీకి, కాంగ్రెస్‌ మధ్య లోపాకాయికారీ ఒప్పందం ఉన్నందునే… నల్గొండ జిల్లాలో అదానీ సిమెంట్‌ ప్లాంట్‌కు అన్ని పనులు సూపర్‌ ఫాస్ట్‌గా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. నల్గొండ సమీపంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట గ్రామం వద్ద ఏటా 40 టన్నుల సిమెంట్‌ తయారీ సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్‌ నిర్మించదలచింది. ఇందుకు భూమి కూడా సేకరించింది. సుమారు 65 ఎకరాల్లో రూ. 1400 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌కు స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. స్థానిక ప్రజలు ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే అధికారుల మద్దతు ఉండటంతో అదానీ ప్లాంట్‌ నిర్మాణానికి అనుమతులు వచ్చేస్తున్నారు. ఈనెల 23న అంటే వచ్చే బుధవారం రామన్నపేటలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్లాంట్‌ స్థలంలోనే సమావేశం జరుగుతోంది. మరి ఆ రోజు జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా సాగుతుందా? దీనికి స్థానిక అధికారులు, పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారనే అంశంపై ఇపుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

Leave a Reply