అది తప్పుడు నివేదిక..
ఒకవైపు అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి హిండెన్‌బర్గ్ నివేదికపై విరుచుకుపడ్డారు. వాటాదారులకు రాసిన ఓ సందేశంలో ఆయన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదు నెలల కిందట వెలువడిన ఈ నివేదికతో అదానీ గ్రూప్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి రావడంతో… అదానీ సంపద సగానికి పైగా పడిపోయిన విషయం తెలిసిందే. మోసపూరిత లావాదేవీలు, స్టాక్ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్ సంస్థలు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ నివేదికపై గౌతమ్ అదానీ తాజాగా స్పందిస్తూ… వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి తప్పుడు సమాచారాన్ని హిండెన్‌బర్గ్ వండివార్చిందని అన్నారు.
‘‘దేశంలోనే అతిపెద్ద ఫాలో ఆన్ పబ్లిక్కు వెళుతున్న సమయంలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడింది. తమ సంస్థను అప్రతిష్ఠ పాల్జేసేందుకు తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేసింది. ఈ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్ ధరలు ప్రభావితం అయ్యాయి. ఎఫ్‌పీఓను అర్ధంతరంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇన్వెస్టర్లకు సొమ్మును తిరిగిచ్చేశాం. షార్ట్ సెల్లర్ నివేదికతో కంపెనీ అనేక ప్రతికూల పరిణామాలూ ఎదుర్కోవాల్సి వచ్చింద”ని వార్షిక నివేదికలో అదానీ పేర్కొన్నారు. ఆ నివేదికలో ఆరోపించినట్లు గ్రూప్ కంపెనీలు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని.. అదే విషయాన్ని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ తేల్చిందని పేర్కొన్నారు.