తీవ్రంగా నిరాశపర్చిన ఎల్ఐసీ
ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్‌కు దరఖాస్తు చేసినవారందరికీ నష్టాలు మిగిల్చింది లిస్టింగ్. ఇవాళ ఉదయం బీఎస్ఈలో ఎక్కడ లిస్టయిందో అక్కడే ముగిసింది ఎల్ఐసీ షేర్. లిస్టింగ్ తరవాత షేర్ రూ.860కి పడిపోయింది. కాని కోలుకుని రూ. 918ని తాకినా…క్రమంగా అమ్మకాల ఒత్తిడి కారణంగా క్షీణిస్తూ వచ్చింది. లిస్టింగ్‌లో షేర్లు పొందినవారు రూ.900పైన బాగా అమ్మినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో అమ్మినవారిలో కొందరు మళ్ళీ కొనుగోలు చేసి లాభం పొందారు. ఉదయం లిస్టింగ్ సమయంలో కొత్తగా కొన్నవారు అడ్డంగా బుక్కయిపోయారు. ఎందుకంటే ఎక్కువ మంది కొన్న చోటే ఈ షేర్ ముగిసింది.డెలివరీ 42 శాతంపైన ఉండటం కాస్త ఊరట కల్గించే అంశం. ఉదయం రూ.6,00,242 కోట్లు ఉన్న ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవాళ్టి క్లోజింగ్ సమయానికి రూ. 5,52,172 కోట్లకు పడిపోయింది. అంటే ఎల్ఐసీ ఇన్వెస్టర్లు రూ.48100 కోట్లు నష్టపోయారు. మార్కెట్ అద్భుతమైన లాభాలు ఆర్జిస్తున్న సమయంలో ఎల్ఐసీ షేర్ ఇంత దారుణంగా పడటంపై ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోతున్నారు. అదే మార్కెట్ నష్టాల్లో ఉండి ఉంటే… నష్టాలు ఇంకా తీవ్రంగా ఉండేదేమో?