వడ్డీరేటు పెంచిన ఎల్ఐసీ హౌసింగ్
భారతీయ జీవిత బీమా సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR) 0.20 శాతం పెంచింది. ఈ నెల నాలుగో తేదీన ఆర్బీఐ రెపో రేటును 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లను పెంచినట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఈ పెంపు కేవలం కొంత మంది రుణగ్రస్తులకేనని కంపెనీ పేర్కొంది. సిబిల్ స్కోర్ 700పైన ఉన్నవారికి మాత్రమే వడ్డీ రేటను 6.7 శాతం నుంచి6.9 శాతం చేసినట్లు కంపెనీ పేర్కొంది. అదే సిబిల్ స్కోరు 700 కంటే తక్కువగా ఉన్నవారికి వడ్డీ రేటు 0.25 శాతం పెంచారు. అలాగే కొత్తగా రుణం తీసుకునేవారికి మాత్రం వడ్డీ రేటు 0.4 శాతం పెరుగుతుందని సంస్థ వెల్లడించింది. వడ్డీరేట్లు పెరిగినా ఇంటి రుణాలకు డిమాండ్ కొనసాగుతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లు పెంచిన విషయం తెలిసిందే.