ప్రభుత్వ పరువు తీసిన LIC IPO

చైనా కంపెనీల మద్దతు ఉన్న పేటీఎం కంపెనీ కేవలం మూడు రోజుల్లో రూ.18,300 కోట్లు సమీకరించింది. కాని భారత ప్రభుత్వ మద్దతు ఉన్న ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ రూ.20,557 కోట్ల సమీకరించేందుకు నానా తంటాలు పడుతోంది. ఎల్‌ఐసీ వ్యాల్యూయేషన్‌ను సగానికి తగ్గించి షేర్లను ఆఫర్ చేసినా… మూడో రోజుకు గాని పబ్లిక్ ఆఫర్ గట్టెక్కలేకపోయింది. రీటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కేవలం 1.23 రెట్లు మాత్రమే. క్యూఐపీ కోటా సగానికి కంటే కొంటే ఎక్కువ అంటే 0.56 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్ అయింది. ఇక ఎన్‌ఐఐల కోటా కూడా ఇంకా పూర్తి కాలేదు. కోటాలో 0.76 శాతానికి సరిపడా షేర్లు మాత్రమే వచ్చాయి. పాలసీదారులు, ఉద్యోగులు మాత్రమే ఈ ఇష్యూను కాపాడారు. పాలపీదారులకు కేటాయించిన కోటాకు నాలుగు రెట్లు సబ్‌స్క్రయిబ్ కాగా, ఉద్యోగుల కోటా 3.06 రెట్లు అయింది. అన్ని షేర్లను కలిపి 1.38 రెట్లు ఇష్యూ సబ్‌స్క్రయిబ్ అయింది. ఇపుడు క్యూఐబీ, ఎన్‌ఐఐ కోటా పూర్తి కావడంతో పాటు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన రావాలి. అపుడు లిస్టింగ్ గౌరవ ప్రదంగా ఉంటుంది.
భారీ స్పందన కోసం…
ఒకవేళ భారీ స్పందన లేకపోతే… సాధారణ ఇన్వెస్టర్లు కూడా కొనడానికి జంకుతారు. ఇప్పటికే భారీ ఆఫర్లకు సబ్‌స్క్రయిబ్ చేసి చాలా మంది ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్నారు. దీంతో ఓపెనింగ్ రోజు మంచి రేటు రావాలి, గౌరవ ప్రదమైన లిస్టింగ్ జరగాలంటే.. ఇష్యూ సక్సెస్ కావాలి. అంటే QIB, NII కోటాతో పాటు రీటైల్ కోటా మరిన్నిరెట్లు సబ్‌స్క్రయిబ్ కావాలి. ఇష్యూను విజయవంతం చేయడానికి ప్రభుత్వం తన అధికారాన్నంతటిని ఉపయోగిస్తోంది. ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ కోసం సెబీ నిబంధనల నుంచి పలు మినహాయింపులు ఇచ్చారు. ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శనివారం కూడా షేర్లను స్వీకరిస్తామని చెప్పారు. శనివారం కూడా స్పందన ఉండదని అనుమానం వచ్చిందేమో… ఆదివారం కూడా అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ASBA) డిజిగ్నేటెడ్ బ్యాంక్ శాఖలన్నీ తెరచి ఉంటాయని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేశాయి. దేశంలో ప్రధాన బ్యాంకులకు ఇలాంటి శాఖలు 24,900 ఉన్నాయి. ఇవన్నీ రేపు తెరచి ఉంటాయి. ఇందులో ఎస్బీఐకి అత్యధికంగా 14,399 శాఖలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 5,462 , ఐసీఐసీఐ బ్యాంకుకు 2,971, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 1,830 శాఖలు ఉన్నాయి. కేవలం ఈ ఒక్క పబ్లిక్ ఇష్యూ కోసం ఇన్ని శాఖలు రేపు పనిచేస్తాయన్నమాట. చిన్న పట్టణాలు, సీనియర్ సిటీజన్స్ కూడా పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. పబ్లిక్ ఆఫర్ సోమవారం ముగుస్తుంది. సాధారణంగా QIB, NIIలు ఇష్యూ చివరి రోజు చేస్తారు. కాబట్టి ప్రభుత్వ దృష్టి అంతా సాధారణ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన రాబట్టడం. రీటైల్ ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. దాన్ని బట్టే లిస్టింగ్ రోజు ప్రీమియం ఆధారపడి ఉంటుంది.