ఆల్ టైమ్ రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్ళు
ఏప్రిల్ నెలలో వస్తు , సేవల పన్ను (GST) వసూళ్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్లో రూ .1.68 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 20 శాతం పెరిగాయి. గత మార్చిలో వసూలైన రూ .1.42 లక్షల కోట్లతో పోలిస్తే రూ .25 వేల కోట్లు పెరిగాయన్నమాట. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరవాత వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం కూడా ఇదే మొదటిసారి . వసూలైన మొత్తం జీఎస్టీలో సీజీఎస్టీ కింద రూ.33,159 కోట్లు , ఎస్జీఎస్టీ కింద రూ .41,793 కోట్లు, ఐజీఎస్ కింద రూ. 81,939 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇవి కాకుండా సెస్ కింద మరో రూ.10,649 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది.