కరెన్సీ, క్రూడ్, బులియన్ అప్…
భారత్‌కు అన్నీ ప్రతికూల అంశాలే. స్టాక్ మార్కెట్ భారీ పతనం ఈక్విటీ ఇన్వెస్టర్లను దెబ్బతీస్తే… కరెన్సీ దిగుమతి దారులను ఇబ్బంది పెడుతోంది.మరోవైపు బ్రెంట్ క్రూడ్ మళ్ళీ 113 డాలర్లను దాటింది. ఇక బులియన్ కేంద్రానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. బులియన్ ధరలతో పాటు దిగుమతులు పెరిగితే కరెంటు లోటు మరింత పెరగనుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చాలా పటిష్ఠంగా ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ ఇవాళ 100.60ని దాటింది. మన దేశంలో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు ఉన్నా… క్రూడ్ ధరలు పెరిగినా… ఆర్బీఐ డాలర్లను అమ్ముతోంది. దీంతో డాలర్‌తో రూపాయి ఒక మోస్తరుగా నిలబడుతోంది. ఇవాళ ఉదయం ఫ్యూచర్స్ మార్కెట్లో 76.52కి చేరిన డాలర్…చివర్లో 76.31 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే గత రెండు రోజులుగా రూపాయి తగ్గుతోంది. దీని ప్రభావం బులియన్ మార్కెట్లో కన్పిస్తోంది. ఎంసీఎక్స్‌లో బంగారం జూన్ కాంట్రాక్ట్ రూ. 668 లాభంతో రూ.53,663 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి మే కాంట్రాక్ట్ రూ. 1723 పెరిగి రూ.70738ని తాకింది. అమెరికా మార్కెట్ ప్రారంభమైన తరవాత బులియన్ ధరల్లో మరింత కదలిక ఉండొచ్చు.