రిలయన్స్‌కు కేజీ బేసిన్ నుంచి కనకవర్షం
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడంతో ఓఎన్‌జీసీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ది పొందనున్నాయి. ముఖ్యంగా క్లిష్టమైన క్షేత్రాల నుంచి గ్యాస్ వెలికి తీస్తున్న రిలయన్స్‌కు చెల్లించే ధర మరింత పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏకంగా రూ.11,500 కోట్ల లబ్ది కలగనుంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిచేసే కంపెనీకి చెల్లించే ధరను కేంద్ర సవరిస్తుంది. ఏడాదికి రెండు సార్లు ఇలా సవరిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లలో గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడంతో ఏప్రిల్ నుంచి ఒక mbtu (million British thermal units)కు చెల్లించే ధర 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు ప్రభుత్వం పెంచింది. క్లిష్ట క్షేత్రాల నుంచి గ్యాస్ వెలికి తీసే రిలయన్స్ కంపెనీకి చెల్లించే ధర 62 శాతం పెంచి 9.92 డాలర్లు చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ అదనంగా రూ. 11,500 కోట్ల దక్కనున్నాయి. వచ్చే అక్టోబర్‌లో మళ్ళీ గ్యాస్ ధరలను పెంచుతారని.. అపుడు పెంపుదల కనీసం 25 శాతం ఉండొచ్చని మోర్గాన్ స్టాన్లీ అంటోంది. అదే జరిగితే మార్చి 2024 ఆర్థిక సంవత్సరానికి రియలన్స్‌కు వచ్చే అదనపు ఆదాయం రూ. 13,500 కోట్లను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.