నెలలో కోటి మొబైల్ కనెక్షన్స్ కట్
దేశంలో మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఒక నెలలో దాదాపు కోటి తగ్గినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ పేర్కొంది. 2021 డిసెంబర్ చివరి నాటికి దేశంలో 115.46 కోట్ల మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఉండగా, 2022 జనవరి నెలాఖరుకు వీటి సంఖ్య 114.52 కోట్లకు తగ్గినట్లు ఆ సంస్థ పేర్కొంది. అంటే 94 లక్షల కనెక్షన్లు తగ్గాయన్నమాట. పట్టణ ప్రాంతాల్లో తగ్గిన కనెక్షన్స్ సంఖ్య 62.2 లక్షలు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 31.5 లక్షలు. పట్టణ ప్రాంతాల్లో జనవరి నెలాఖరుకు 62.71 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 51.81 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. దేశంలోని మొత్తం కనెక్షన్లలో ప్రైవేట్ కంపెనీల చేతిలో 89.76 శాతం ఉండగా, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ మార్కెట్ వాటా 10.24 శాతం. ఇక ప్రైవేట్ కంపెనీలవారీగా చూస్తే రిలయన్స్ జియో మార్కెట్ వాటా 35.49 శాతం కాగా, ఎయిర్‌టెల్ వాటా 31.13 శాతం, వొడాఫోన్ ఐడియా కంపెనీకి 23.15 శాతం వాటా ఉంది.