పీవీఆర్, ఐనాక్స్ విలీన ప్రకటన నేడే?
సినీ మల్టిప్లెక్స్ కంపెనీలైన పీవీఆర్, ఐనాక్స్ల విలీనం కానున్నాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీల నుంచి ప్రతిపాదన ఇవాళ వెలువడే అవకాశముంది. పీవీఆర్, సినీపొలిస్ విలీనం అవుతాయని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ విలీన చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇవాళ రెండు కంపెనీల బోర్డులు సమావేశమై విలీనానికి ఆమోద ముద్ర వేయనున్నాయి. ఈ రెండు కంపెనీలు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రెండు కంపెనీలు విలీనమైతే రూ. 16,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఏర్పడుతంది. గత శుక్రవారం పీవీఆర్ షేర్ 1.55 శాతం పెరిగి రూ. 1804 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11,100 కోట్లకు చేరింది. అలాగే ఐనాక్స్ లీజర్ షేర్ గత శుక్రవారం 6 శాతం లాభంతో రూ. 470 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5700 కోట్లకు చేరింది. పీవీఆర్ వద్ద 860 స్క్రీన్స్ ఉండగా, ఐనాక్స్ వద్ద 675 స్క్రీన్స్ ఉన్నాయి.