స్విగ్గీ… బిలియన్ డాలర్ల ఐపీఓకు రెడీ
ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించేందుకు సిద్ధమౌతోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ జొమాటొ షేర్ నిలదొక్కుకోవడంతో… మార్కెట్లో ప్రవేశించేందుకు ఇదే సరైన సమయంగా కంపెనీ భావిస్తోంది. మార్కెట్లో నుంచి బిలియన్ డాలర్లు అంటే రూ.7,500 కోట్లు సమీకరించాలని స్విగ్గీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఓ కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్లను నియమించినట్లు తెలుస్తోంది . త్వరలోనే మర్చంట్ బ్యాంకర్లను కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఐపీఓ ద్వారా కంపెనీ తన ఈక్విటీలో 10 % వాటా విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ కల్లా సెబి వద్ద కంపెనీ ప్రాస్పెక్టస్ దాఖలు చేసే అవకాశముంది. 2014లో ప్రారంభమైన స్విగ్గీకి 500కు పైగా నగరాల్లో 1,85,000 రెస్టారెంట్లు, విక్రయశాలల నుంచి వినియోగదార్లకు సేవలందిస్తోంది. కంపెనీ వ్యాల్యూయేషన్ 1070 కోట్ల డాలర్లుగా లెక్కిస్తున్నారు. కేవలం ఆరు నెలల్లో ఈ కంపెనీ వ్యాల్యూయేషన్ రెట్టింపు అయింది.