MID REVIEW: యూరో మార్కెట్ల చావుదెబ్బ
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా చాలా తీవ్రంగా ఇబ్బంది పాలయ్యేది యూరప్ దేశాలే. తమ ఖనిజాలు, ఆయిల్ అవసరాలు చాలా వరకు రష్యా, ఉక్రెయిన్ దేశాలపై ఈ దేశాలు అధికంగా ఆధారపడ్డాయి. గత శుక్రవారం నాలుగు శాతంపైగా నష్టపోయిన యూరప్ మార్కెట్లు ఇవాళ కూడా నాలుగు శాతం నష్టపోయాయంటే… మార్కెట్ల పరిస్థితి ఊహించవచ్చు. ఆయిల్, డాలర్‌ల షాక్ నుంచి మార్కెట్లు తేరుకోలేక పోతున్నాయి. ఇప్పటికీ బ్రెంట్ క్రూడ్ 128 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో యూరో మార్కెట్లపై ఆశలతో దిగువ స్థాయి నుంచి 200 పాయింట్లు కోలుకున్న నిఫ్టి మళ్ళీ దిగువ ముఖం పట్టింది. ఇవాళ ఉదయం 15741 స్థాయికి పతనమై నిఫ్టి మిడ్ సెషన్ కల్లా 15944 పాయింట్లకు చేరింది. కాని యూరో స్టాక్స్ 50 సూచీ 3 శాతం దాకా క్షీణించడం జర్మనీ డాక్స్ 4 శాతంపైగా క్షీణించడంతో … నిఫ్ఠి మళ్ళీ బలహీనపడింది. ప్రస్తుతం 382 పాయింట్ల నష్టంతో 15862 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇవాళ ఒక్క రోజే బ్యాంక్ నిఫ్టి 4.8 శాతం క్షీణించింది. గత అక్టోబర్‌లో 41,829 వద్ద ఉన్న బ్యాంక్ నిఫ్టి ఇవాళ 32,631 పాయింట్లను తాకింది.అంటే సుమారు 25 శాతం క్షీణించింది. అయినా మార్కెట్ల దశ,దిశపై నిపుణులు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.