ఎల్ఐసీ ఐపీఓ వాయిదా?
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) వాయిదా పడనుందా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ది హిందూ బిజినె్‌సలైన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలిస్తే…ఆ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఎల్ఐసీ ఐపీఓపై ముందుకు వెళ్లాలనే ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలు అనుకూలించకపోతే, ఐపీఓపై సమీక్షకూ వెనకాడం’ అని ఆమె అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఏం జరుగబోతోందనే అంశంపై ప్రపంచ నేతల్లోనే క్లారిటీ లేదు. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆంక్షలతో మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజీని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూబుల్ పతనంతో అనేక బ్లూచిప్ కంపెనీలకు కోలుకోని దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో మరింత పరిస్థితి ముదురుతుందా అన్న చర్చ స్టాక్ మార్కెట్లో వినిపిస్తోంది. ఇక వైపు రోడ్‌షోలు పూర్తి చేసిన ఎల్ఐసీ… ఈ నెల 11కి ఐపీఓ రావొచ్చని వదంతులు మార్కెట్లో ఉన్నాయి. ఈలోగా రష్యా, ఉక్రెయిన్ పరిస్థితులు సద్దుమణగకపోతే… ఎల్ఐసీ ఐపీఓ వాయిదా పడే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి.