400 పాయింట్ల నిఫ్టి రికవరీ
ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఉదయం నామమాత్రపు లాభంతో ముగిశాయి. అయితే అమెరికా ఫ్యూచర్స్‌తో పాటు యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. రష్యాపై ఆంక్షల కారణంగా ఆ దేశంతో అధిక లావాదేవీలు ఉన్న మార్కెట్లు భారీగా క్షీణించాయి. జర్మనీ డాక్స్ 2.5 శాతం లాభంతో ఉంది. యూరో స్టాక్స్ 50 సూచీ ఏకంగా మూడు శాతం క్షీణించడం విశేషం. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కారణంగా భారత మార్కెట్‌కు ముఖ్యంగా మెటల్ కంపెనీలకు లాభంగా మారుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశాల నుంచి మెటల్స్, ఆయిల్ సరఫరా బాగా తగ్గనుందని తెలియడంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. హిందాల్కో, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వంటివి టాప్ గెయినర్స్‌లో ముందున్నాయి. దీంతో ఇవాళ ఉదయం 16,356 పాయింట్లకు పడిపోయిన నిఫ్టి తరవాత అనూహ్యంగా కోలుకుంది. ఏకంగా 400 పాయింట్లకుపైగా కోలుకుంది. మిడ్ సెషన్ కల్లా గ్రీన్‌లోకి వచ్చిన నిఫ్టి తరవాత మళ్ళీ నష్టాల్లోకి వచ్చినా… వెంటనే తేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 120 పాయింట్ల లాభంతో (తాత్కాలిక డేటా) 16,778 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 388 పాయింట్ల లాభపడింది. నిఫ్టి నెక్ట్స్, మిడ్ క్యాప్ నిఫ్టి సూచీలు కూడా ఒక శాతం లాభపడ్డాయి. దిగువ స్థాయి నుంచి కోలుకున్నా… బ్యాంక్ నిఫ్టి 0.65 శాతం నష్టంతో ముగిసింది. మహాశివర రాత్రి కారణంగా రేపు మార్కెట్‌కు సెలవు. దీంతో అనేక కౌంటర్లలో షార్ట్ కవరింగ్ వచ్చినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి.