మోడీ పాలనలో ధనవంతులే బాగుపడ్డారు
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారని, పేదలు మరింత పేదలు అయ్యారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. పంజాబ్ ఓటర్లను ఉద్దేశిస్తూ ఆయన ఓ సందేశం ఇచ్చారు. జనం ఇపుడు తాము చేసిన మంచి పనుల గురించి గుర్తు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రధాని సెక్యూరిటీ పేరుతో పంజాబ్ ముఖ్యమంత్రిని, పంజాబ్ ప్రజలను అవమానం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక విధానమే అర్థం కాలేదన్నారు. దేశంలోనే కాదు, విదేశీ విధానాల్లోనూ మోడీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చైనా మన సరిహద్దుల్లో కూర్చొని ఉంది, ఈ విషయాన్ని దాచి ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. రాజకీయ నేతలను కౌగిలించుకున్నంత మాత్రాన… ఆహ్వానించకుండానే వెళ్ళి బిర్యానీ తిన్నంత మాత్రాన విదేశాలతో బంధాలు మెరుగు పడవని అన్నారు. ఆహ్వానం లేకుండా మోడీ అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్ళికి వెళ్ళిన అంశాన్ని ప్రస్తావించారు. బ్రిటీష్ ప్రభుత్వం అవలంబించిన ‘విభజించు పాలించు’ విధానంపైనే బీజేపీ జాతీయవాద విధానం ఆధారపడి ఉందని మన్మోహన్ సింగ్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనం చేశారని ఆయన ఆరోపించారు.