హువావే కంపెనీపై ఐటీ దాడులు
చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ హువావే ఆఫీసులపై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేశారనే అనుమానంతో ఇవాళ ఢిల్లీ, గురుగ్రామ్, బెంగుళూరులో ఉన్న కంపెనీ ఆఫీసుల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ZTE కంపెనీపై కూడా ఐటీ అధికారులు ఇలాంటి దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. కంపెనీకి చెందిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, అకౌంట్ పుస్తకాలు, కంపెనీ ఇతర రికార్డులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హువావే కంపెనీ మాత్రం తాము భారతీయ చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఐటీ అధికారులు వస్తున్నట్లు తమకు సమాచారం ఇచ్చారని, ఆమేరకు అధికారులను అందుబాటులో ఉంచామని పేర్కొంది. గత ఏడాది చైనాకు చెందిన జియోమి, ఒప్పొ కంపెనీలపై కూడా ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే.