For Money

Business News

నిఫ్టి రోల్‌కోస్టర్‌ రైడ్‌… అయినా నష్టాలే

మన బలాలపై కాకుండా… ఇతర మార్కెట్ల హెచ్చతగ్గులను బట్టి … రోలర్ కోస్టర్  రైడ్‌లా సాగింది ఇవాళ నిఫ్టి పయనం. ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి ఒకే రోజు ఆరుసార్లు నష్టాల్లోకి జారుకోవడం విశేషం. పైగా దిగువ స్థాయి నుంచి 220 పాయింట్లకు పైగా లాభపడి… మళ్ళీ నష్టాల్లోకి జారింది. నిజానికి ఆల్గో ట్రేడింగ్‌ చేసిన డే ఇన్వెస్టర్లకు ఇవాళ భారీ లాభాలు దగ్గాయి. ఇవాళ ఉదయం పేర్కొన్నట్లు కీలక స్థాయి 250 ప్రాంతానికి వచ్చినపుడల్లా నిఫ్టికి మద్దతు అందింది. అలాగే రెండో ప్రతిఘటన స్థాయి 17,500కి దగ్గరైన వెంటనే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. వెరశి యూరో మార్కెట్లు బలంగా ప్రారంభమైనపుడు ఉవ్వెత్తున ఎగిసిన నిఫ్టి… యూరో మార్కెట్లు బలహీనపడేసరికి ఊసురోమని పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే 30 పాయింట్ల నష్టంతో 17,332 వద్ద నిఫ్టి ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి మాత్రం అర శాతం పైగా నష్టంతో ముగిసింది. ఉదయం నుంచి దివీస్‌ ల్యాబ్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఎస్‌బీఐ టాప్‌ లూజర్‌గా రెండు శాతం నష్టంతో ముగిసింది.