ఐటీఆర్ అప్డేట్ ఒక్కసారే…
ఒక అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను ఒక్కసారే అప్డేట్ చేయడానికి అనుమతి ఉంటుందని సీబీడీటీ చైర్మన్ జేబీ మోహాపాత్ర తెలిపారు. రిటర్న్‌లను పూర్తిగా ఫైల్ చేయలేకపోయినవారి కోసం …అప్డేట్ చేసే అవకాశాన్ని ఇస్తున్నామన్నారు. ఐటీఆర్‌లను ఫైల్ చేసిన తర్వాత రెండేండ్లలోపు వాటిలో మార్పులు చేర్పులు చేసి అప్డేట్ చేసుకునేందుకు 2022-23 బడ్జెట్ అనుమతించిన విషయం తెలిసిందే. పన్నులు చెల్లించిన తర్వాత మాత్రమే వీటిని అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత 12 నెలల్లోపు అప్డేట్ చేసుకుంటే.. ఇంకా చెల్లించాల్సిపన్ను, దానిపై వడ్డీ కలిపి అదనంగా 25 శాతం కట్టాలి. 12-24 నెలల మధ్య అప్డేట్ చేసుకుంటే ఈ మొత్తం 50 శాతానికి పెరుగుతుంది. కానీ ఏదైనా అసెస్మెంట్ సంవత్సరంలో నోటీసు జారీచేసి, ప్రాసిక్యూషన్ ప్రక్రియను ఐటీ శాఖ ప్రారంభిస్తే, ఆ పన్ను చెల్లింపుదారు రిటర్న్‌ను అప్డేట్ చేయడానికి వీలుండదు. అలాగే అప్డేటెడ్ రిటర్న్‌ను సమర్పించి, అదనపు పన్నుల్ని చెల్లించకపోతే, ఆ రిటర్న్‌ను ఇన్వాలిడ్గా పరిగణిస్తారు.