గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ సలహాపై కేంద్రం ఫైర్
నకిలీ వార్తలను అరికట్టడంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు ఘోరంగా విఫలమౌతున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలపై గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సంస్థలతో ఇటీవల కేంద్ర అధికారులు సమావేశం నిర్వహించారు. జనవరి 31న జరిగిన వర్చువల్ సమావేశంలో కంపెనీల ప్రతినిధులకు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు మధ్య వాడి వేడిగా సంభాషణలు జరగినట్లు కొందరు అధికారులు పేర్కొంటూ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనం రాసింది. ఫేక్ న్యూస్‌ను సామాజిక మీడియా సంస్థలు తొలగించక పోవడం తామే స్వయంగా రంగంలోకి దిగి తొలగించాల్సి వస్తోందని ప్రభుత్వం పేర్కొంది.దీనికి గూగుల్ ప్రతినిధి ఓ సలహా ఇచ్చారు.మీరు ఒకవేళ అభ్యంతరకరమైన వీడియో లేదా వార్తలను తొలగించినా… వాటిని బయట పెట్టవొద్దని కోరారు. ఈలోగా తాము కూడా ఫేక్ న్యూస్ తొలగించే విషయమై చర్యలు తీసుకుంటామని అన్నారు. తొలగించిన వెబ్‌సైట్లు, వీడియోల గురించి బయటపెట్టడం వల్ల తమ కంపెనీ పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అధికారులు టెక్ కంపెనీలకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని సంబందిత వర్గాలు తెలిపాయి.