ఇక నుంచి ఆ కాల్స్‌ను రెండేళ్ళు భద్రపర్చాల్సిందే…
ఇంటర్నేషనల్ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్‌తో పాటు మెసేజ్‌లను రెండేళ్ళపాటు భద్రపర్చాలని టెలికాం కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్ ద్వారా చేసే ఈ కాల్స్‌ను రెండేళ్ళు భద్ర పర్చాలని టెలికాం విభాగం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్లో జారీ చేసిన యునిఫైడ్ లైసెన్స్‌కు ఈ మేరకు టెలికాం విభాగం సవరణ చేసింది. గతంలో ఈ కాల్స్, మెసేజ్‌లను ఒక ఏడాది వరకు మాత్రమే భద్రపర్చాల్సి వచ్చేది. తాజా ఉత్తర్వులు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్లకు వర్తిస్తాయి. అలాగే టాటా కమ్యూనికేషన్స్, సిస్కోకు చెందిన వెబెక్స్, ఎటీ అండ్ టీ గ్లోబల్ నెట్వర్క్ వంటి కంపెనీలకు కూడా తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఇవి ఇంటర్నెట్ ప్రొటోకాల్స్‌ను ఉపయోగిస్తాయి. వీశాట్ లైసెన్స్ ఉన్నవారు కూడా కొత్త నిబంధనను పాటించాల్సి ఉంటుంది. వాయిస్‌కాల్స్, ఆడియోటెక్స్, యనిఫైడ్ మెసేజింగ్ సర్వీసెస్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి.