భారత్‌పేలో స్కామ్… వ్యవస్థాపకుడిపై వేటు?
గత కొన్ని రోజులుగా భారత్‌పే కంపనీ వార్తల్లో ఉంటోంది. ఇది కొంత మంది ఉద్యోగులను తొలగించిన ఈ కంపెనీ ఈసారి ఏకంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌ను కూడా తొలగించవచ్చని వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని గమనించిన కంపెనీ ఓ లా కంపెనీని, రిస్క్ అడ్వయిజరీ కన్సల్టెంట్‌ను నియమించింది. ఇటీవల తొలగించిన 15 మంది ఉద్యోగుల్లో గ్రోవర్ భార్య మాధురి జైన్ కూడా ఉన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ అయిన మాధురి ఈ కంపెనీలో చేరే ముందు ఒక ఫ్యాషన్ బౌతిక్ నిర్వహించారు. ఫ్యాషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ అయిన ఈమె కంపెనీ ఆర్థిక వ్యవహారాలు చూసేది. అర్హతలు ఉన్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను నియమించేందుకు జరిగిన ప్రయత్నాలను ఆమె అడ్డుకున్నట్లు విచారణలో తేలింది. ఆమెపై వేటు వేసిన కంపెనీ ఇపుడు ఏకంగా సహ వ్యవస్థపకుడిని కూడా తొలగించాలని నిర్ణయించింది. నైకా పబ్లిక్ ఇష్యూకు ఫైనాన్సింగ్ ఏర్పాటు చేయాలంటూ కొటక్ వెల్త్ మేనేజ్మెంట్ ఉద్యోగిని ఫోన్లో గ్రోవర్ బెదిరించిన ఆడియో క్లిప్ ఇటీవల బయటపడింది. అప్పటి నుంచి గ్రోవర్‌పై కంపెనీ కన్ను వేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఆర్థిక లావాదేవీల విషయంలో గ్రోవర్ ఆయన భార్య మాధురితోపాటు కొంత మంది బంధువులు కూడా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.