For Money

Business News

స్వయంగా ఎదిగిన అత్యంత ధనవంతురాలు

కేవలం 9 ఏళ్ళలో ఆమె నెలకొల్పిన కంపెనీ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటింది. తన సంపద దాదాపు రూ 49,000 కోట్లకు చేరింది. సరిగ్గా తనకు 50 ఏళ్ళు నిండుతున్న సమయంలో ఫాల్గుణి నాయర్‌  సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. 2012 ఏప్రిల్‌లో నైకా (నిజానికి కంపెనీ పేరు నాయిక..)ను నెలకొల్పారు. ఆన్‌లైన్‌లో బ్యూటీ ప్రొడక్స్ట్స్‌ను అమ్మడం ప్రారంభించారు. తరవాత దుస్తులను నైకా ఫ్యాషన్‌ పేరుతో అమ్మడం ప్రారంభించారు. కాని కంపెనీ టర్నోవర్‌లో అధికభాగం ఆన్‌లైన్‌ సేల్స్‌ ద్వారానే వస్తోంది. కేవలం 9 ఏళ్ళలోనే ఈ కంపెనీని లాభదాయక కంపెనీగా మారింది. ఇవాళ షేర్‌ మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్‌ లిస్టయింది. ఈ కంపెనీ షేర్లు అలాట్‌ అయినవారికి వారంలో 85 శాతం లాభం వచ్చింది. సాధారణంగా స్టార్టప్‌లు చాలా వరకు నష్టాల్లోఉంటాయి. లాభదాయకమైన కంపెనీ కావడం, భవిష్యత్తులో విస్తరించేందుకు అధిక అవకాశాలు ఉండటంతో షేర్‌ మార్కెట్‌లో ఈ షేర్‌కు మంచి డిమాండ్‌ వచ్చింది. ముంబైలో పుట్టి పెరిగిన ఫాల్గుణి నాయర్‌ సాధారణ మహిళ మాత్రం కాదు. ఐఐఎం అహ్మదాబాద్‌ గ్రాడ్యుయేట్‌. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ఆమె 18 ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేశారు. కొటక్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కొటక్‌ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగిన మహిళ ఆమె. ఆ అనుభవంతో ప్రారంభించిన నైకా అద్భుత ఫలితాలు సాధించింది. దేశంలో ఇపుడున్న మహిళా కోటీశ్వరులలో సావిత్రి జిందాల్‌ టాప్‌లో ఉన్నారు. అయితే ఆమె సంపద వారసత్వంగా వచ్చింది. స్వయంగా ఎదిగిన కోటీశ్వరులలో ఫాల్గుణి నాయర్‌ నంబర్ వన్‌  స్థానంలో ఉన్నారని బ్లూమ్‌బర్గ్‌ బిలియన్‌ ఇండెక్స్‌ చెబుతోంది. ఫాల్గుణి నాయర్‌ భర్త సంజయ్‌ నాయర్‌, ఇద్దరు పిల్లలు కూడా ఈ వ్యాపారాన్నే చూసుకుంటున్నారు.