నేటి నుంచి పేటీఎం ఐపీఓ
మార్కెట్ నుంచి రూ. 18300 కోట్ల సమీకరణ కోసం పీటీఎం ఇవాళ పబ్లిక్ ఇష్యూకు రానుంది.
పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ జారీ చేస్తున్న ఈ ఇష్యూ ఈనెల 10వ తేదీన ముగుస్తుంది. మొత్తం రూ. 18,300 కోట్లలో రూ.8,300 కోట్లను తాజాగా షేర్ల ద్వారా సమీకరిస్తున్నారు. ఈ నిధులు మాత్రమే కంపెనీకి వెళ్తాయి. ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.10,000 కోట్ల విలువైన షేర్లు అమ్ముతున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ఇప్పటికే రూ.8235 కోట్లు సమీకరించింది. ఈ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.2080-2150గా నిర్ణయించారు. మొత్తం ఇష్యూలో 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయిస్తారు. రిటైలర్లు కనీసం 6 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇష్యూ గరిష్ఠధర ప్రకారం చూస్తే కనీస దరఖాస్తు మొత్తం రూ.12,900. గరిష్ఠంగా ఒక ఇన్వెస్టరు 15 లాట్లకు దరఖాస్తు చేయొచ్చు. అంటే రూ.1,93,500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మనదేశ చరిత్రలో ఇదే అతి పెద్ద పబ్లిక్ ఆఫర్. గతంలో భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా మార్కెట్ నుంచి రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం ఈ షేర్ గ్రే మార్కెట్‌లో రూ. 2300 వద్ద ట్రేడ్ అవుతున్నట్లు సమాచారం. అంటే ఇష్యూ ధరతో కేవలం ఏడు శాతం మాత్రమే లాభం వస్తుందన్నమాట. నవంబర్ 15వ తేదీకల్లా అలాట్‌మెంట్ పూర్తవుతుంది. అలాట్‌మెంట్ దక్కని వారికి ఈనెల 16న సొమ్ము వెనక్కి ఇచ్చేస్తారు. అలాట్‌మెంట్ వచ్చినవారి ఖాతాల్లోకి ఈనెల 17న షేర్లు బదిలీ చేస్తారు. ఈ ఆఫర్ ఈనెల 18వ తేదీన లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్కెట్‌లోపోటీ తీవ్రంగా ఉండటం, పైగా ఈ కంపెనీ ఉన్న రంగంపై మూడు నియంత్రణ సంస్థల అజమాయిషీ ఉంటుంది. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ సంస్థలు అజమాయిషీ ఉంటుందని కాబట్టి… వీటి నియంత్రణల ప్రభావం ఈ కంపెనీపై ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు అంతంత మాత్రం ఆసక్తి చూపుతున్నారు.