ఐఆర్సీటీసీ… ట్రెండింగ్
నిజమే ఇవాళ స్టాక్ మార్కెట్లో ఐఆర్సీటీసీ షేర్లో వచ్చిన కదలికలు… సాధారణ ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి. షేర్ ధర పెరిగినపుడు…. తగ్గితే కొందామని అనుకున్న ఇన్వెస్టర్లకు ఐఆర్సీటీసీ షేర్ ఎపుడూ దక్కలేదు. ముఖ్యంగా షేర్ పెరుగుతున్న స్పీడు చూసి చాలా మంది ఈ కౌంటర్లో ప్రవేశించేందుకు కూడా భయపడ్డారు. కాని భయపడినవారు భారీగా నష్టపోయారు. ఇవాళ మాత్రం అతిగా ఆశ పడినవారు చతికిల పడ్డారు. ఇది ఇవాళ్టికి మాత్రమే. ఎందుకంటే రేపు మళ్ళీ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ షేర్ ఇచ్చిన కుదుపుకు ట్వీటర్ ట్రెంగింగ్లో ఉంది ఈ షేర్. ఇక మీమ్స్ చెప్పనక్కర్లేదు.
2 ఏళ్ళలో 1700 శాతం పెరిగింది
సరిగ్గా రెండేళ్ళ క్రితం అంటే 2019 అక్టోబర్ ఈ షేర్ రూ. 320 వద్ద లిస్టయింది. రెండేళ్ళలో 1,700 శాతంపైగా పెరిగింది. ఆరంభంలో కొన్నవారెవరూ పెద్దగా అమ్మలేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ కంపెనీ కావడం, పైగా తను ఉన్న రంగంలో ఈ కంపెనీకి పోటీ లేకపోవడం. ప్రతిఫలం తక్కువ వచ్చినా… ప్రభుత్వ కంపెనీ కదా అని పెట్టుబడి సురక్షితమని చాలా మంది తమ షేర్లను అమ్మలేదు. దీంతో లిక్విడిటీ తక్కువగా ఉంది ఈ కౌంటర్లో. అదే కలిసి వచ్చింది ఇన్వెస్టర్లకు. దీర్ఘకాలంగా ఉన్న ఇన్వెస్టర్లకే కాదు… గత ఏడాది ఎంటర్ అయిన ఇన్వెస్టర్లకు కూడా కనకవర్షం కురిపించింది ఈ షేర్. ఇవాళ మాత్రం పెద్ద ఝలక్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 7 శాతం పైగా పెరిగింది షేర్. దీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను దాటింది. ఉదయం స్వల్పంగా పడి… మళ్ళీ పెరగడంతో ఇన్వెస్టర్లు అమ్మలేదు. కాని కేవలం ఒక గంటలో సీన్ మారిపోయింది. షేర్ గరిష్ఠ ధర నుంచి 24 శాతం పడేసరికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 80,000 కోట్లకు పడిపోయింది. అంటే ఈ ఒక్క రోజే ఈ కౌంటర్లో ఇన్వెస్టర్ల నోషనల్ నష్టం రూ. 20,000 కోట్లు అన్నమాట. కరోనా సెకండ్ వేవ్ తగ్గాక ఈ కౌంటర్లో కొనుగోళ్ళు జరుగుతున్నా…గత 9 రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 30,000 కోట్లు పెరిగిందంటే… ఇన్వెస్టర్ల ఆసక్తి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాని ఎంత మంచి కంపెనీ అయినా.. ఆరోగ్యకరమైన కరెక్షన్ ఉంటేనే… సుస్థిరంగా నిలబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. విశ్లేషకులు ఈ కౌంటర్లో వచ్చిన లాభాల స్వీకరణ మంచిదేనని వీరు అంటున్నారు. రూ. 4700 ప్రాంతంలో మద్దతు ఉందని అంటున్నారు. చూడాలి. ఏం జరుగుతుందో?