For Money

Business News

బొగ్గు నిల్వలు లేవు…ఆదుకోండి

ఇంధన సంక్షోభం, విద్యుత్‌ ధరలపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన కోరారు. రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాల వద్ద ఒకట్రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయన్నారు. ఏపీలోని థర్మల్‌ కేంద్రాల్లో రోజుకు 90 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం 50 శాతమే జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు.

‘కోవిడ్‌ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ 15 శాతం పెరిగింది. గత ఒక్కనెలలోనే విద్యుత్‌ డిమాండ్‌ 20 శాతానికిపైగా పెరిగింది. విద్యుత్‌ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని’’ సీఎం లేఖలో పేర్కొన్నారు.

‘‘రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్‌ కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండటం లేదు. ఏపీ థర్మల్‌ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని కోరుతున్నాం. కొంతకాలంగా పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఓఎన్‌జీసీ, రియలన్స్‌ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్‌ సరఫరా చేయాలని కోరుతున్నాం. విద్యుత్‌ డిస్కంలకు బ్యాంకుల ద్వారా సులభతరమైన రుణాలివ్వాలి. కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను పునరుద్ధరించి మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో కోరారు.