కుప్పకూలిన వాల్‌స్ట్రీట్
ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లలో చైనా, జపాన్ వంటి మార్కెట్లకు సెలవు కావడంతో రేపు అక్కడ నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యే అవకాశముంది. ఇవాళ తెరచి ఉన్న హాంగ్‌కాంగ్ మార్కెట్ దాదాపు మూడున్నర శాతం నష్టపోయింది. భారత మార్కెట్ ఒక శాతం నష్టపోగా.. యూరప్‌లో చాలా మార్కెట్లు ఒకటిన్నర నుంచి రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక వాల్‌స్ట్రీట్ ప్రారంభం నుంచి నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ కోలుకుంటుందని ఆరంభంలో ఆశించిన వారికి నిరాశే మిగిలింది. నాస్డాక్ రెండున్నర శాతం, ఎస్ అండ్ పీ 500, డౌజోన్స్ రెండు శాతం మేర నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా ఆర్థిక సమస్యలతో పాటు మంగళ, బుధవారాల్లో జరిగే ఫెడ్ సమావేశం నేపథ్యంలో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ కచ్చితంగా ఉద్దీపన ప్యాకేజీకి సాయం తగ్గించడం ఖాయమని తెలుస్తోంది. బాండ్ ఈల్డ్స్ పెరగడమే దీనికి సూచి. మరోవైపు ఇవాళ కూడా డాలర్ పటిష్ఠంగా గ్రీన్‌లో ఉంది. క్రూడ్ ఆయిల్ ఒకటిన్నర శాతంపైగా క్షీణించింది. బంగారం స్థిరంగా ఉంది. వెండి కాస్త బలహీనంగానే కన్నిస్తోంది. ట్రేడింగ్ చివర్లో వాల్ స్ట్రీట్ కోలుకోని పక్షంలో రేపు కూడా మార్కెట్లు నష్టాలను చవిచూడక తప్పదు.