రిలయన్స్ కౌంటర్‌లో ఏం జరుగుతోంది?
జియో పబ్లిక్ ఆఫర్ ప్రారంభం కానున్న కొద్దిరోజుల ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన కౌంటర్లలో జరుగుతున్న లావాదేవీలపై స్టాక్ మార్కెట్‌లో హల్‌చల్ జరుగుతోంది. ఐపీఓకు ముందు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో రిలయన్స్ కౌంటర్‌లో అనూహ్య లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా చూపుతోంది. మార్కెట్ లిమిట్‌కు మించి ఇద్దరు ట్రేడర్లు పొజిషన్స్ తీసుకున్నట్లు మింట్ ప్రతిక రాసింది. ఈ కౌంటర్‌లో ఇలాంటి ట్రేడ్స్ జరగడం అత్యంత అరుదు (Rarest of Rare) అంటూ ఆ పత్రిక అభివర్ణించింది. అక్టోబర్ నెల ప్రారంభం నుంచే మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ (MWPL)కు మించి అంటే మూడు శాతం మించి రెండు ట్రేడ్స్ జరిగినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా చెబుతోంది. పొజిషన్స్ తీసుకున్న ఇద్దరు ట్రేడర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం తేదీ దగ్గర పడే కొద్దీ గ్రే మార్కెట్‌లో ప్రీమియం భారీగా తగ్గుతోంది. ఆఫర్ సైజ్‌తో పాటు ధర తగ్గించినా… ఆఫర్‌పై మార్కెట్‌లో పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది. ఇపుడు గ్రే మార్కెట్ ప్రీమియం 20 శాతం కూడా లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ కౌంటర్లలో జరుగుతున్న ట్రేడింగ్‌పై మార్కెట్‌లో ఆసక్తి నెలకొంది. ఇటీవలి కాలంలో రిలయన్స్ షేర్ భారీగా క్షీణించినందున… మున్ముందు భారీగా పెరుగుతుందన్న ఆశతో కొందరు ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. షేర్‌లో ర్యాలీ వస్తుందనే ఆశతో లేదా జియో ప్లాట్ ఫామ్ ఐపీఓ తరవాత కంపెనీ రీరేటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు పొజిషన్స్ తీసుకుని ఉండొచ్చని క్వాంట్ ఈక్విటీ రీసెర్చ్‌కు చెందిన అనలిస్ట్ కృతి షా మింట్ పత్రికతో అన్నారు.ఈనెల 13న రిలయన్స్ షేర్ రూ. 1152కి అంటే 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అక్కడి నుంచి కోలుకుని గత శుక్రవారం రూ. 1211 వద్ద ముగిసింది. ఐపీఓను దృష్టిలో పెట్టుకునే కొందరు ట్రేడర్లు భారీ పొజిషన్స్ తీసుకుని ఉండొచ్చని చాలా మంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి ట్రేడ్‌లు రిలయన్స్ కౌంటర్‌లో చాలా అరుదుగా జరుగుతుందటాయని వీరు అంటున్నారు. ఇష్యూ తరవాత రిలయన్స్ షేర్ రీరేటింగ్ ఉండొచ్చని కూడా వీరు అంటున్నారు. ఈ కౌంటర్‌లో ఈ స్థాయి పొజిషన్స్ తీసుకోవడం కేవలం విదేశీ ఇన్వెస్టర్లకు లేదా పెద్ద దేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే సాధ్యమని అనలిస్టులు అంటున్నారు.
