రూ. 8 లక్షల కోట్లు పోయే
శుక్రవారం రూ. 5 లక్షల కోట్లు, ఇవాళ మరో రూ. 8 లక్షల కోట్లు. ఇపుడు మార్కెట్ ట్రెండ్ నిఫ్టి పాయింట్లకు బదులు… ఎన్ని లక్షల కోట్లు పోయాయని రాసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం జీడీపీ డేటా ప్రకటించిన తరవాత వరుసగా 29వ రోజు మార్కెట్ పడింది. జీడీపీ డేటాపై విదేశీ ఇన్వెస్టర్లకు అనుమానం రావడంతో… ప్రభుత్వం ప్రకటించే ఏ డేటాను కూడా ఇపుడు విదేశీ ఇన్వెస్టర్లు నమ్మడం లేదు. కేవలం అంతర్జాతీయ పరిణామాలు, క్రూడ్, డాలర్‌ను బట్టి ట్రేడింగ్ చేస్తున్నాయి. ఇవాళ ఉదయం గిఫ్ట్ నిఫ్టి నష్టాలు కేవలం వంద పాయింట్ల వరకు ఉన్నా… ట్రేడింగ్ మొదలైన తరవాత తెలిసింది… విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం. ఇవాళ నిఫ్టి ఏకంగా 360 పాయింట్లు పడిందంటే… పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిత్రంగా ఇవాళ విదేశీ ఇన్వెస్టర్లు రూ. 5000 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 5వేల కోట్ల విలువైన షేర్లను కొన్నారు. మరి రూ. 8 లక్షల కోట్ల సంపద ఎలా ఆవిరి అయిపోయింది? నిఫ్టికి ఈ స్థాయి నష్టాలు ఎలా వచ్చాయి.. అంటే రీటైల్ ఇన్వెస్టర్లు కూడా అమ్ముతున్నారన్నమాట. రెండేళ్ళయినా ఎలాంటి ప్రతిఫలం ఇవ్వని నిఫ్టిపై ఇపుడు సాధారణ ఇన్వెస్టర్లకు విశ్వాసం పోయింది. మరోవైపు ఆకర్షణీయ బ్యాంకు రేట్లు రీటైల్ ఇన్వెస్టర్లు ఆకర్షిస్తోంది. ఇక అమెరికాలో పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ విదేశీ ఇన్వెస్టర్లను లాగుతున్నాయి.
ముఖ్యంగా ఇరాన్‌తో రాజీకి ట్రంప్ ససేమిరా అనడం, మధ్యంతర ఎన్నికల తరవాత క్రూడ్ ధరలు తగ్గుతాయని చెప్పడంతో …. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు అమాంతంగా పెరిగాయి. ఈలోగా ఇరాన్‌పై అమెరికా తీవ్ర దాడులు చేస్తుందని మార్కెట్ నమ్ముతోంది. ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్‌లో మరిన్ని దాడులు చేయొచ్చు. ఈ నేపథ్యంలో డాలర్ కూడా పెరగడంతో భారత దేశ చమురు దిగుమతి బిల్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. పైగా మహారాష్ట్ర వంటి ధనిక దేశాలు కరువు రాష్ట్రాలుగా మారుతున్నాయి. తెలంగాణ, కర్ణాటకలో కూడా పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఖరీఫ్ సంగతేమోగాని.. రబీపై ఆశలు పోయాయి. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్లవలు 50 శాతం దిగువకు చేరాయి. విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఇవన్నీ సెప్టెంబర్‌తో ముగిసే రెండో త్రైమాసిక మాసిక ఫలితాల్లో కన్పించనున్నాయి. అంటే ఈసారి క్వార్టర్లీ రిజల్ట్స్ పై ఆశలు వొదలుకోవాల్సిందే. ఐటీ కంపెనీలతో సహా. ఈ నేపథ్యంలో నిఫ్టికి ఎక్కడ మద్దతు లభిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. దీంతో పెరిగినపుడు చూద్దామంటూ… ఇపుడు అమ్మేస్తున్నారు. నిఫ్టి ఆల్ఫా ఏకంగా రెండు శాతంపైగా పడింది. ఐటీ మినహా చాలా వరకు రంగాల సూచీలు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు నష్టపోయాయి. ఇపుడు అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అంటే రేపు కూడా నిఫ్టికి నష్టాలు తప్పేలా లేవు. పైగా రేపు నిఫ్టి వీక్లీతో పాటు మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా.
