For Money

Business News

క్యాప్‌స్టన్‌లో నందమూరి వాటా

హోం సర్వీసెస్‌ బిజినెస్‌ ఊపందుకుంటున్న నేపథ్యంలో క్యాప్‌స్టన్‌ సర్వీసెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ప్రమోటర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొడాలి శ్రీకాంత్‌ హోం సర్వీసెస్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. దీని కోసం క్యాప్‌స్టన్‌ సర్వీసెస్‌లో తన వాటాలో 4 శాతం వాటాను నలుగురు ఇన్వెస్టర్లకు విక్రయించారు. వీరిలో నటుడు నందమూరి కళ్యాణ్‌ రామ్‌, నందమూరి స్వాతి కూడా ఉన్నారు. రూ. 567 ధరకు వీరు చెరో 2.5 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. అలాగే కొసరాజు ఈశ్వరనారాయణ, కొసరాజు హరి కృష్ణలు కూడా చెరో 2.5 లక్షల షేర్లు షేర్లు కొనుగోలు చేశారు. దీంతో కంపెనీ ప్రమోటర్‌ కొడాలి శ్రీకాంత్‌ వాటా 71 శాతం నుంచి 67 శాతానికి తగ్గుతుంది. ఈ వాటా విక్రయం ద్వారా కొడాలి శ్రీకాంత్‌కు వచ్చిన రూ. 68.10 కోట్లను మళ్ళీ క్యాప్‌స్టన్‌ హోం సర్వీసెస్‌లో పెట్టుబడి పెట్టనున్నారు. దీంతో ఈ విభాగం మరింత విస్తరణకు మార్గం సుగమమైంది. క్యాప్‌స్టన్‌ హోం సర్వీసెస్‌లో నటుడు అక్కినేని నాగార్జునకు రెండు శాతం వాటా ఉంది. కంపెనీ తరఫున ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు.
జెట్‌ స్పీడుతో…
లిస్టయినప్పటి నుంచి క్యాప్‌స్టన్‌ సర్వీసెస్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. 2018లో ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 98లకు ఆఫర్‌ చేసింది. 2020లో కంపెనీ 1:6 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేసింది. అలాగే 2024 ఆగస్టులో షేర్‌ ముఖ విలువను రూ. 10 నుంచి రూ. 5లకు చేసింది. దీంతో ఇన్వెస్టర్ల వద్ద ఉన్న షేర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఆ తరవాత ఈ ఏడాది మార్చిలో కంపెనీ మళ్ళీ 1:2 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను ప్రకటించింది. దీంతో పబ్లిక్‌ ఆఫర్‌ సమయంలో తీసుకున్న 1,200 షేర్లు 4,200లకు చేరాయన్నమాట. ఇపుడు ఈ షేర్‌ రూ.577 ధర వద్ద ట్రేడవుతోంది. అంటే ఇన్వెస్టర్ల వద్ద ఉన్న షేర్ల వాటా విలువ రూ. 23 లక్షలు దాటిందన్నమాట. ఈ లెక్కన చూస్తే కంపెనీ CAGR 43 శాతాన్ని దాటిందన్నమాట. ఇన్వెస్టర్ల పెట్టుబడి 21 రెట్లు పెరిగింది. గడచిన అయిదు సంవత్సరాలనే తీసుకుంటే కంపెనీ ఆదాయం రూ. 213 కోట్ల నుంచి రూ 830 కోట్లకు చేరింది. అంటే CAGR 31 శాతం దాటింది. అదే నికర లాభం విషయానికొస్తే CAGR 34శాతం దాటింది. గడచిన అయిదేళ్ళలో కంపెనీ నికరలాభం రూ. 6.42 కోట్ల నుంచి రూ. 28.10 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు సెక్యూరిటీ సర్వీసెస్‌పై దృష్టి సారించిన కంపెనీ ఇపుడు హోం సర్వీసెస్‌పై కూడా దృష్టి సారించింది. భారీగా విస్తరిస్తోంది.

Leave a Reply