ఈ షేరుకు ‘నిమ్మగడ్డ’ గండం!
గత ఏడాది రూ. 288ని తాకి…. చిప్ షేర్లలో గట్టిగా నిలబడుతుందని అనుకున్న మాస్‌చిప్ టెక్నాలజీస్ ఇపుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చిప్ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తుంటే…ఈ కంపెనీ ఇపుడు అంతర్గత సమస్యలతో సతమతమౌతోంది. ఈ ఏడాది మార్చిలో యుద్ధ ఆరంభం సమయంలో రూ. 146కు పడిన మాస్‌చిప్ ఇటీవల రూ. 250ని తాకినా… వెంటనే ఏదో ఒక ప్రతికూల వార్తతో రూ. 200 దిగువకు వచ్చేస్తోంది. తాజాగా వాన్‌పిక్ కేసు ఈ కంపెనీకి తలనొప్పిగా తయారైంది. వాన్‌పిక్ కేసుకు మాస్‌చిప్ కంపెనీకి సంబంధం ఏమిటంటారా? మాస్‌చిప్ కంపెనీలో ప్రధాన వాటాదారు… వాన్‌పిక్ కంపెనీ ప్రమోటర్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె గునపాటి స్వాతిరెడ్డి. ఆమెకు ఈ కంపెనీలో 45 శాతం దాకా వాటా ఉంది. ఈ వాటా మయూఖ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఉంది. ఈ కంపెనీ స్వాతి రెడ్డిదే. అయితే వాటాదారుల ప్యాటర్న్ చూస్తే స్వాతి రెడ్డి గ్రూప్ వ్యక్తులు, సంస్థలకు అధిక వాటా ఉన్నట్లు అనిపిస్తోంది. సాధారణ వాటాదారుల శాతం 22 శాతమే ఉన్నట్లు కంపెనీ రికార్డులు తెలుపుతున్నాయి. లక్షా లేదా అంతకన్నా ఎక్కువ షేర్లు ఉన్నవారు 129 మంది దాకా ఉన్నారు. ఈ లెక్కన చూస్తే మాస్‌చిప్ కంపెనీ స్వాతిరెడ్డి చేతిలో ఉన్నట్లే? అయితే తమ నుంచి పొందిన సొమ్మును మ్యాట్రిక్స్ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి ద్వారా మాస్‌చిప్ కంపెనీలో పెట్టారని అంటోంది రస్ అల్ ఖైమా సంస్థ.
అదే గొడవ
వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఏపీలో వాన్‌పిక్ కంపెనీని మ్యాట్రిక్స్ ప్రసాద్ పెట్టారు. 2008లో జాయింట్ వెంచర్‌గా రస్ అల్ ఛైమా కంపెనీ (రాకియా)ను తీసుకున్నారు. ఆ కంపెనీ వాన్‌పిక్‌లో పెట్టుబడి పెట్టింది. జగన్ కేసులో మ్యాట్రిక్స్ ప్రసాద్ అరెస్ట్ కావడం, వాన్‌పిక్ ఆస్తులను ఏపీ ప్రభుత్వం జప్తు చేయడంతో … రస్ అల్ ఖైమా కంపెనీ UAE కోర్టులో ప్రసాద్‌పై కేసు వేసింది. ఆ కోర్టు తీర్పు ఇస్తూ రూ. 950 కోట్లు చెల్లించాల్సిందిగా ప్రసాద్‌ను ఆదేశించింది. సదరు కోర్టు తీర్పును అమలు చేయాలంటూ భారత కోర్టులో కేసు వేసింది. దీనికి సంబంధించి తెలంగాణలో కేసులు నడుస్తున్నాయి. తమ నుంచి తీసుకున్న సొమ్మును తన సొంత కంపెనీలకు మళ్ళించారని రాకియా ఆరోపిస్తోంది. మాస్చిప్లో స్వాతి రెడ్డి పెట్టిన పెట్టుబడి కూడా ఆ కోవలోకి చెందినదేనని అంటోంది. ఇపుడు కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు మరో రూ. 200 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా జమ చేయాలని మ్యాట్రిక్ ప్రసాద్‌ను ఆదేశించింది. తన పేరును రాకియా ప్రస్తావించడంతో ఈ కేసులో మాస్‌చిప్ ఇంప్లీడ్ అయింది. రాకియా కేసుతో తమకు సంబంధం లేకున్నా… పార్టీగా చేరింది. రాకియా కేసుతో తమకు సంబంధం లేదని, ఈ వ్యవహారాల నుంచి తమను మినహాయించాలని కోరింది. వ్యాపారంలో భాగంగా పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని, వాటికి ఇబ్బంది కల్గకుండా చూడరాదని కోరింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఈ గొడవ అంతా తెలంగాణ కోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. ఈకేసు తమ కంపెనీకి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని… రూ. 200 కోట్లను కట్టమని మ్యాట్రిక్ ప్రసాద్‌కు చెప్పిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు మాస్‌చిప్ తెలిపింది. దీంతో ఇవాళ కంపెనీ షేర్ రూ. 215 వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ కౌంటర్లో డెలివరీ వ్యాల్యూమ్ 65 శాతం ఉండటం విశేషం. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల ప్రభావంతో ఈ కౌంటర్లో మున్ముందు ఏం జరుగనుందో?
