For Money

Business News

చంద్రకు రూ. 22,000 కోట్ల నజరానా?

బహుశా భారత దేశ కార్పొరేట్‌ చరిత్రలో ఈ స్థాయి రుణమాఫీ జరగడం ఇదే మొదటిసారి ఏమో? పైగా ఓ వ్యక్తికి… కంపెనీకి కాదు. జీ గ్రూప్‌ అధినేత, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న సుభాష్‌ చంద్రకు సంబంధిచిన రూ. 22000 కోట్ల రుణాన్ని ఎన్‌సీఎల్‌టీ దాదాపు కొట్టేసింది. ఆయన ఇవ్వాల్సిన మొత్తం రూ. 22,006 కోట్లు కాగా, ఇందులో రూ. 6.5 కోట్లు చెల్లించాల్సిందిగా తాజాగా NCLT ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన NCLT జ్యుడిషియల్ మెంబర్‌ జడ్జి నిలేష్‌ శర్మ 144 పేజీల ఉత్తర్వులు జారీ చేశారు. రుణదాతులు అడిగినంత సొమ్ము సుభాష్‌ చంద్ర వద్ద లేదని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం విశేషం. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు జడ్జీల బెంచ్‌ భిన్న తీర్పు ఇచ్చింది. దీంతో శర్మను ఈ ధర్మాసనంలో మూడో సభ్యునిగా చేర్చారు. ఆయన చంద్రకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దాదాపు 99.97 శాతం హెయిర్‌ కట్‌ (రుణ మాఫీ)తో ఇచ్చిన ఈ తీర్పు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాపం ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇచ్చిన రుణం ఏకంగా రూ. 1322 కోట్లు కాగా, కేవలం రూ. 38 లక్షలతో సరిపెట్టుకొమ్మని NCLT ఆదేశించడం కార్పొరేట్‌ రంగం ఆశ్చర్య పోయేలా చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ము ఇలా వేల కోట్లను ఎలా మాఫీ చేస్తారని సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీనిపై యూనైటెడ్‌ బ్యూవరీస్‌ మాజీ ఛైర్మన్‌, ప్రముఖ పారశ్రామిక వేత్త విజయ్‌ మాల్యా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. తాను రూ. 6203 కోట్లు బాకీ ఉంటే… ఏకంగా రూ. 14,100 కోట్లను తన నుంచి వసూలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్‌ మాల్యా విదేశాల్లో ఉంటే ఆయన కంపెనీ షేర్లను ఈడీ జప్తు చేసింది. ఆ తరవాత వీటిని డచ్‌ కంపెనీ హెంకిన్‌ ఎన్‌వీకి అమ్మేశారు. మాల్యాకు కంపెనీలో ఉన్న 15 శాతం వాటాను రూ. 5824 కోట్లకు అమ్మేశారు. ఇంకా ఇతర ఆస్తులను కూడా జప్తు చేసి అమ్మేశారు. తన ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 14,100 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వం అంగీకరించిందని విజయ్‌ మాల్యా ఇవాళ తన పోస్ట్‌ పెట్టారు. కాని ఏ మీడియా సంస్థ కూడా దీన్ని ప్రశ్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply