ఇవాళ మార్కెట్‌కు మద్దతు?
వరుసగా ఆరు రోజులు నష్టాల్లో ముగిసిన నిఫ్టి… ఇవాళ కూడా రెడ్‌లో ప్రారంభం కానుంది. కాకపోతే నష్టాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. రాత్రి అమెరికాలో టెక్, చిప్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ రికార్డు స్థాయికి పెరగడం, క్రూడ్ ధరలు ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేకపోవడంతో నాస్‌డాక్‌లో ఒత్తిడి కన్పిస్తోంది. చాలా వరకు టెక్, చిప్ షేర్లు రాత్రి నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. కోప్సి అయిదు శాతంపైగా నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్ కూడా నష్టాలతో ప్రారంభం కానుంది. అయితే రేపు మళ్ళీ సెన్సెక్స్ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు ఉన్నందున… ఇవాళ దిగువ స్థాయిలో మద్దతు అందే అవకాశముంది. భారీ నష్టాలు ఇవాళే ఉంటాయా అన్నది చూడాలి. ఎందుకంటే ఆగస్టు డెరివేటివ్స్ లో నిఫ్టి 24000 వద్ద ముగిసే ఛాన్స్ అధికంగా ఉందంటూ అనలిస్టులు సంకేతాలు ఇస్తున్నారు. కేవలం 150 పాయింట్ల దూరంలో ఉంది. మరి సిరీస్ ముగింపు లోపల 24000 స్థాయిని టచ్ చేస్తుందా లేదా ఇదే స్థాయిలో కదలాడుతుందా అన్నది చూడాలి. ఇవాళ ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌తోపాటు ఇతర ఎన్‌బీఎఫ్‌సీలలో కొనుగోళ్ళ ఆసక్తి రావొచ్చు. గోల్డ్ బిజినెస్ విస్తరించాలని ఎల్ అండ్ టీ ఫైనాన్స్ భావిస్తున్నట్లు నిన్న బ్రోకరేజి రిపోర్ట్‌లు వచ్చాయి. ఏబీ క్యాపిటల్ కూడా జోరుగా జువలరీ షాపులను తెరుస్తోంది. ఈ లెక్కన ఈ కౌంటర్‌లోకూడా మద్దతు లభిస్తుందేమో చూడాలి. ఇక ఫెడరల్ బ్యాంక్ షేర్‌ను కూడా అనలిస్టులు సూచిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌తోపాటు ఈ షేర్ చాలా పటిష్ఠంగా కన్పిస్తోంది.
