రష్యా ఆయిల్ మరింత చౌక?

ఒకవైపు యూరోపియన్ యూనియన్ ఆంక్షలు, మరోవైపు అమెరికా పెనాల్టీ వేస్తుందో అన్న భయాందోళనలు రష్యాను వెంటాడుతున్నాయి. వీటి నేపథ్యంలో తన ఆయిల్‌కు మరింత డిమాండ్ తగ్గుతుందేమోనని… భారత్‌కు తక్కువ ధరకు చమురును ఆఫర్ చేస్తున్నట్లు డేటా ఇంటిలిజెన్స్ సంస్థ అయిన కెప్లర్ లిమిటెడ్ వెల్లడించింది. రష్యా సంస్థలు సరఫరా చేసే ఆయిల్‌ను ఉరల్స్ ఆయిల్ అంటారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ఆసియా దేశాలు కొనే ఆయిల్‌ను బ్రెంట్ క్రూడ్ అంటారు. మొన్నటి దాకా ఈ రెండు రకాల క్రూడ్ మధ్య దాదాపు తేడా ఉండేది కాదు. ఇపుడు బ్రెంట్ కంటే అయిదు డాలర్లు తక్కువకే ఉరల్స్ అయిల్ లభిస్తున్నట్లు కెప్లెన్ పేర్కొంది. అమెరికా చర్యలపై ఇంకా అనిశ్చితి ఉన్న కారాణంగా ఉరల్స్ ఆయిల్ ధరల్లో డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశముంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోళ్ళ విషయంలో భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ రిఫైనరీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పైగా ఆగస్టు – అక్టోబర్ మధ్యకాలంలో రష్యాలోని రిఫైనరీలు మెయింటెన్స్ కోసం మూసివేస్తారు. ఈ సమయంలో ముడి చమురు ఎగుమతులను రష్యా మరింత పెంచుతుందని కెప్లెర్ సంస్థ క్రూడ్ ఆయిల్ విశ్లేషకుడు హుమాయున్ ఫలక్ షాహి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్ తన చమురు దిగుమతుల్లో 37 శాతం చమురును రష్యా నుంచి కొంటోంది. దీనికి ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే భారత చమురు సంస్థలు భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఈ దిగుమతులను నిలిపేసే ఛాన్స్ లేదు. తక్కువ ధరకు లభిస్తున్నా తాత్కాలికంగా రష్యా చమురు దిగమతులను ఆపేసే అంశాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పరిశీలిస్తున్నా… ప్రైవేట్ సంస్థలు మాత్రం దిగుమతి చేసుకుంటున్నాయని కెప్లెర్ పేర్కొంది.మే నెల నుంచి అమెరికా నుంచి భారత్ కొంటున్న ముడి చమురు కూడా బాగా పెరిగింది. ఇపుడు రోజుకు 2.25 లక్షల బ్యారెల్స్‌ను భారత్ కొంటోంది. 2025 ఆరంభం నాటి కొనుగోళ్ళతో పోలిస్తే ఇవి రెట్టింపు అని కెప్లెర్ సంస్థ పేర్కొంది.